Donald Trump: నా జోక్యం వల్ల 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి .. లేదంటే : ట్రంప్

పాక్ ప్రధాని స్వయంగా ఈ మాట చెప్పారన్న అమెరికా అధ్యక్షుడు

Update: 2026-02-25 05:45 GMT

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే ఏకంగా 8 యుద్ధాలను ఆపానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధం అతి ముఖ్యమైందని అన్నారు. తాను జోక్యం చేసుకోనట్లైతే ఆ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగేదని చెప్పారు. తన జోక్యం వల్లే 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని స్వయంగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పారన్నారు.

భారత్-పాక్ గొడవ పడుతుంటే తాను చూస్తూ కూర్చోలేదని.. యుద్ధం ఆపకపోతే రెండు దేశాల మీద 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించడంతో ఇద్దరూ దారికి వచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. గతేడాది మే నెలలో భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ మీద విరుచుకుపడినప్పుడు.. అది అణు యుద్ధానికి దారితీయకుండా ఆపింది తానేనని ఆయన ‘స్టేట్ ఆఫ్ యూనియన్’ ప్రసంగంలో ప్రకటించారు.

యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా.. భారత్ మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ‘‘మా మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదు.. మా ఆర్మీ ఆఫీసర్ల మధ్య జరిగిన చర్చల వల్లే కాల్పులు ఆగాయి’’ అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఏప్రిల్ 2025లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సరిహద్దు దాటి ఉగ్రవాదుల ఊచకోత కోసింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం వణికిపోయినా.. ట్రంప్ మాత్రం దాన్ని తన క్రెడిట్‌గా మార్చుకోవడం గమనార్హం.

Tags:    

Similar News