జైలులో మారణహోమం, 41 మంది మహిళా ఖైదీలు మృతి
సెంట్రల్ అమెరికాలోని హోండురస్ జైలులో గ్యాంగ్ వార్
సెంట్రల్ అమెరికాలోని హోండురస్ అనే ప్రాంతంలోని ఓ జైలులో దారుణం జరిగింది. దేశ రాజధాని తెగుసిగల్పాకు 30 మైళ్ల దూరంలో ఉన్న తమారా మహిళాజైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 41 మంది మరణించారు. వీరిలో 26 మంది సజీవ దహనం కాగా, మరికొందరు తుపాకీ బుల్లెట్ గాయాలు, దెబ్బలతో మరణించారు. మరో ఏడుగురు తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జైలులో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవే ఈ మరణాలకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది మారా గ్యాంగ్ సభ్యుల వల్లే ఈ మారణ హోమం జరిగిందని చెబుతున్నారు. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు మొదలయ్యాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత జైలు నుంచి తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జైలులో మహిళా ఖైదీల మరణించడంపై హోండురస్ అధ్యక్షురాలు జియోమర క్యాస్ట్రో స్పందించారు. మహిళా ఖైదీల మరణాలు.. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆమె తెలిపారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని క్యాస్ట్రో పేర్కొన్నారు.
బారియో 18 అనే గ్యాంగ్ కొంతమందికి నిప్పంటించి మరికొంతమందిని తుపాకితో కాల్చి, కొట్టి మారణాహోమం సృష్టించింది అని చెబుతున్నారు. చనిపోయిన వారు ఎవరు, బతికున్నవారు ఎవరు అన్న విషయం పోలీసులు వెంటనే చెప్పకపోవడంతో జైలు బయట ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో తమను ఒక గ్యాంగ్ బెదిరిస్తోందని, ప్రతి విషయానికి ఇతరులను ఇబ్బంది పెడుతుందని, జైల్లో ఉన్నా భయంతోనే ఉంటున్నామని తమ కుటుంబ సభ్యులు తమతో చెప్పినట్టు ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఈ మాటలు అవుననే చెప్తున్నారు. దేశంలోని కొన్ని జైల్లలో ముఠాలు విపరీతమైన ప్రాబల్యాన్ని కలిగి ఉంటాయి. వారు తమ సొంత నియమావళిని ఏర్పరచుకొని ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి విషయంపై చర్యలు తీసుకుటామని, అయినా మళ్లీ చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుందన్నారు. ఈసారి వారు తుపాకులు మరియు ఇతర ఆయుధాలను కూడా ఆక్రమంగా రవాణా చేయగలగడం ఆశ్చర్యకరముగా ఉందన్నారు. ఇకపై మరింత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.