Hajj: మక్కాలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!
సహజ మరణం... వృద్ధాప్యం కారణంగా కూడా;
హజ్ యాత్రకు వచ్చి ఈ సంవత్సరం 600 మందికి పైగా మృతి చెందారని, అందులో 68 మంది భారతీయులు ఉన్నారని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఒకరు బుధవారం వెల్లడించారు. భారత్ నుంచి వచ్చిన వారిలో 68 మంది మృతి చెందినట్లు గుర్తించామన్నారు. ఇందులో కొందరు సహజంగా, మరికొందరు వృద్ధాప్యం కారణంగా మృతి చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకొంతమంది వాతావరణ పరిస్థితుల కారణంగా మృత్యువాత పడినట్లు చెప్పారు.
ఈ ఏడాది హజ్ యాత్రలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వేడిని తట్టుకోలేక 550 మందికి పైగా మృతి చెందినట్లు మంగళవారం అరబ్ ప్రతినిధులు తెలిపారు. మక్కాలో ఉష్ణోగ్రతలు దాదాపు 52 డిగ్రీలుగా నమోదైంది. మరణించిన వారిలో ఈజిప్ట్, జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు (Egyptians) కాగా, 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. మంగళవారం వరకూ ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 600కి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణంగా తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు.
ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారాలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.