Afghan boy: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి , అదే విమానంలో వెనక్కి

రెండు గంటల పాటు ప్రమాదకరంగా ప్రయాణించిన బాలుడు

Update: 2025-09-23 04:00 GMT

ఒక ఊహకందని సాహసంతో 13 ఏళ్ల ఆఫ్ఘ‌నిస్థాన్‌ బాలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. విమానం టైర్లు ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఏకంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. రెండు గంటల పాటు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణించి సురక్షితంగా కిందకు దిగడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకి వెళితే... ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కందూజ్‌ పట్టణానికి చెందిన ఈ బాలుడు, కాబూల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కేఏఎం ఎయిర్‌లైన్స్ విమానం వద్దకు చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా విమానం టైర్ల మీదుగా ఎక్కి, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత, బాలుడు కిందకు దిగి ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గమనించారు. అతడిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం సరదా కోసం, సాహసం చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేశానని ఆ బాలుడు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాలుడు దాక్కున్న ప్రదేశంలో ఎరుపు రంగులో ఉన్న ఒక చిన్న స్పీకర్ తప్ప మరేమీ లభించలేదు. ఎలాంటి విద్రోహ చర్యలకు అవకాశం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతించారు. అనంతరం అదే రోజు రాత్రి ఆ బాలుడిని అదే విమానంలో తిరిగి కాబూల్‌కు పంపించేశారు. ఈ విషయాన్ని అధికారులు సోమవారం అధికారికంగా వెల్లడించారు.

Tags:    

Similar News