Afghan Journalists : జర్నలిస్టులపై తాలిబన్ల అరాచకం..
అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే తమ స్వేచ్ఛ కోసం పోరాడుతూ మహిళలు అందోళన చేపడుతున్నారు.;
Afghan Journalists : అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే తమ స్వేచ్ఛ కోసం పోరాడుతూ మహిళలు అందోళన చేపడుతున్నారు. అయితే దీనిని కవర్ చేసిన ఇద్దరు జర్నలిస్టుల పైన తాలిబన్లు కర్కశత్వం ప్రదర్శిచారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వివారాల్లోకి వెళ్తే.. పశ్చిమ కాబుల్‌లోని కర్తే ఛార్ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనలను తాలిబన్లు అడ్డకున్నారు.
దీనిని అఫ్గాన్ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్‌కు చెందిన ఓ ఇద్దరు జర్నలిస్టులు కవర్ చేయడానికి ప్రయత్నించారు. దీనితో తాలిబన్లు వారిని తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లుగా పేర్కొంది. కాగా గాయపడిన జర్నలిస్టుల ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీనికి ముందు మహిళల నిరసనను కవర్ చేస్తున్న ఓ వీడియో గ్రాఫర్‌ను తాలిబన్లు అదుపులోకి తీసుకుని అతని ముక్కు నేలకు రాయించారు. అంతేకాకుండా మరో జర్నలిస్టును కాలితో తన్ని అతడి వద్ద ఉన్న కెమరాను లాక్కున్నారు.