Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. బహిరంగ కొరడా శిక్ష మహిళలకు కూడా
మానవ హక్కుల సంస్థలు, UN నుంచి వ్యతిరేకత
కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో షరియా చట్టం అమలు చేస్తున్నారు. ఈక్రమంలో తాలిబన్ల ప్రభుత్వం దేశంలో అనేక అమానుష చర్యలకు పాల్పడుతుందని, మానవ హక్కుల సంస్థలు, UN నుంచి వ్యతిరేకత వస్తుంది. తాలిబన్ల చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవని, అవి అమానవీయమైనవిగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ఆప్ఘన్‌లో తాలిబన్లు ఈ శిక్షలను కొనసాగిస్తున్నారు. తాజాగా నివేదికల ప్రకారం.. గత నెలలో తాలిబన్లు దేశవ్యాప్తంగా 114 మందిని బహిరంగంగా కొరడాతో శిక్షించారని, ఈ శిక్షను అనుభవించిన వారిలో 20 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం.
తాజా నివేదికల ప్రకారం.. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 22 వరకు సన్‌బులాలో కొరడా దెబ్బల సంఖ్య మునుపటి నెలతో పోలిస్తే రెట్టింపు అయ్యింది. మొత్తం మీద సన్‌బులాలో ఇటువంటి కేసుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది. గత నెలలో 10 కొరడా దెబ్బల సంఖ్యను ఈ నెలలో 50కి పెంచారు. తాలిబన్ల ప్రభుత్వం ఈ శిక్షలను కనీసం 15 ప్రావిన్సులలో అమలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాబూల్, పర్వాన్, తఖార్‌లలో అత్యధిక సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. ఘోర్, లోగర్, బాల్ఖ్, లగ్మాన్, తఖార్, బదఖ్షాన్, జోవ్జాన్, బాగ్లాన్‌లలో కొరడా దెబ్బలకు గురైన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళల్లో ఎక్కువ మంది ఇంటి నుంచి పారిపోయిన వారు, లేదా నైతికంగా దిగజారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని తాలిబన్లు అంటున్నారు.
తాలిబన్‌ల శిక్షలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మానవ హక్కుల కార్యకర్త మసూదా కోహిస్తానీ మాట్లాడుతూ.. భయాన్ని కలిగించడానికి, క్రూరత్వంతో తాలిబన్లు బహిరంగంగా కొరడా దెబ్బల శిక్షలను విధిస్తున్నారని అన్నారు. మరో కార్యకర్త హుమైరా ఇబ్రహీం మాట్లాడుతూ.. పౌరులలో భయాన్ని కలిగించడం ద్వారా వారిపై నియంత్రణను పెంచుకోడానికి ఇలాంటి శిక్షలను విధిస్తున్నారని, కానీ ఇవి మానవ గౌరవాన్ని ఉల్లంఘిస్తాయి, ప్రజల్లో కోపాన్ని పెంచుతాయని చెప్పారు.
మానవ హక్కులపై ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న దాడిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్ ప్రత్యేక పరిశీలకుడు రిచర్డ్ బెన్నెట్ ఈ నెలలో నిర్వహించిన మానవ హక్కుల మండలిలో మాట్లాడుతూ.. ఈ ఏడాది 672 మందిని కొరడా దెబ్బలతో శిక్షించారని చెప్పారు. షరియా చట్టాన్ని అమలు చేసే ప్రయత్నాల్లో భాగంగా తాలిబన్లు బహిరంగంగా కొరడా దెబ్బల శిక్షలను సమర్థిస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితితో సహా అనేక దేశాలు తాలిబన్ల శిక్షలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు, సౌదీ అరేబియా, ఇరాన్, మలేషియా వంటి దేశాలలో ఈ కొరడా దెబ్బల శిక్షలు అమలు అవుతున్నాయి.