BlueOrigin: జెఫ్ బెజోస్ రోదసీ యాత్ర గ్రాండ్ సక్సెస్
BlueOrigin: అంతరిక్షయానంలో మరో గ్రాండ్ సక్సెస్. వర్జిన్ గెలాక్టిక్ రికార్డును బ్లూ ఆరిజిన్ తిరగరాసింది.;
Image Source :Twitter
BlueOrigin: అంతరిక్షయానంలో మరో గ్రాండ్ సక్సెస్. వర్జిన్ గెలాక్టిక్ రికార్డును బ్లూ ఆరిజిన్ తిరగరాసింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో న్యూ షెపర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రోదసి యాత్ర దిగ్విజయం సాగింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు ఈ ప్రయాణంలో ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం చేపట్టడం విశేషం.
సబ్‌ఆర్బిటల్ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా న్యూ షెపర్డ్ యాత్ర సాగింది. బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. నేల నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటే.... ఇప్పుడు బెజోస్ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి... చరిత్ర సృష్టించింది. మైక్రో గ్రావిటీ స్థితిని అనుభవించిన బెజోస్ బృందం... నిమిషాల వ్యవధిలోనే రోదసీ యాత్ర పూర్తి చేసుకుంది. ప్యారాచూట్ల ద్వారా సురక్షితంగా దిగారు బెజోస్ టీమ్.
అయితే భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు. అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది. దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు. అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది. ఈ నేపథ్యంలో తమ అంతరిక్షయాత్రపై ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా చూసేందుకు 100 కిలోమీటర్లను దాటి వెళ్లనున్నట్లు బ్లూ ఆరిజిన్ పేర్కొంది.
ఈ యాత్రలో బెజోస్‌తో పాటు 82 ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్ వెళ్లారు. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించారు. 1960లలో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సంబంధించిన మెర్క్యురీ కార్యక్రమం కింద వ్యోమగామి శిక్షణ పొందారు. అయితే నాడు ఆమెకు రోదసిలోకి వెళ్లే అవకాశం దక్కలేదు. అలాగే ఇప్పుడు ఆమెతోపాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్ డేమన్.. అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇక మిగిలిన ఆ నాలుగో వ్యక్తి బెజోస్ సోదరుడు మార్క్. ఈ యాత్ర కోసం తొలుత వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తి.... అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బెజోస్ సోదరుడు మార్క్‌కు ఈ అవకాశం దక్కింది.