USA:ఓవైపు కార్చిచ్చు.. మరోవైపు మంచు, ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతున్న అమెరికా.
ఇప్పటి దాకా కార్చిచ్చులో 12 మంది మృతి.;
అమెరికా ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతోంది. అటు మంటలు.. ఇటు మంచు తుఫాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కేలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. కేలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రస్తుతం పాలిసేడ్స్ ప్రాంతంలో మంటలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దానితో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రెంట్‌వుడ్, గెట్టీ సెంటర్ వంటి ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచనలు చేశారు.
ఇక కార్చిచ్చు మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, శుక్రవారం సాయంత్రం నుంచి గాలుల వేగం నెమ్మదించినప్పటికీ పరిస్థితి ఇంకా నియంత్రణలోకి రాలేదు. పసిఫిక్ పాలిసేడ్స్, బ్రెంట్‌వుడ్ ప్రాంతాల్లో హాలీవుడ్ తారలు ఇంకా ప్రముఖ క్రీడాకారులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది. మరోవైపు ఇదే సమయంలో, అమెరికాలోని ఇతర రాష్ట్రాలు మంచు తుపాను ప్రభావం పడి వణికిపోతున్నాయి. టెక్సాస్, ఒక్లహోమా, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో మంచు తుపాను కారణంగా రహదారులపై మంచు పేరుకుపోయి వాహనాలు నిలిచిపోయాయి. విమాన సేవలు కూడా తీవ్రంగా అంతరాయం పొందాయి.
లాస్ ఏంజెలెస్ నగరంలో కార్చిచ్చులను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడంలో విఫలమయ్యారు. సరిపడా నీళ్ల అందుబాటులో లేకపోవడం, అలాగే అగ్నిమాపక ప్రణాళికలలో లోపాలు కూడా ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య భవనాల మంటలను అదుపు చేసే సాధనాలు ఉండటానికి, అపార్ట్‌మెంట్లు లేదా పెద్ద భవనాలు మంటల్లో చిక్కుకున్నప్పుడు విమానాలను రంగంలోకి తరలించడం తప్ప మరే ఇతర మార్గం లేదు. ఆ సమయానికీ, గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడంతో, అగ్నిమాపక సిబ్బంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఈ సహజ విపత్తులు ఇంకా చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి.