Saudi-Pak defence deal: సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య చారిత్రాత్మక రక్షణ ఒప్పందం
ప్రభావాన్ని అంచనా వేస్తున్నామన్న భారత విదేశాంగ శాఖ
చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్), పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి జరిగినట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. భద్రతను పటిష్టం చేసుకోవడం, ప్రపంచ శాంతి కోసం కృషి చేయడంపై తమ రెండు దేశాల అంకితభావాన్ని ఈ ఒప్పందం ప్రతిఫలిస్తుందని సౌదీ, పాక్ బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నట్లు సౌదీ వార్తాసంస్థ తెలిపింది. రెండు దేశాల మధ్య మరింత బలమైన రక్షణ సహకారానికి ఇది పునాదిగా సంయుక్త ప్రకటన అభివర్ణించింది. ఒప్పందంపై సంతకాలు చేసిన కార్యక్రమంలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌తోపాటు ఉప ప్రధాని ఇషాక్ దర్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాల్గొంది.
అవసరమైతే పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వస్ర్తాలు కూడా సైనిక సహకారంలో భాగంగా ఒప్పంద పరిధిలోకి రావచ్చని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఇది లాంఛనంగా కుదిరిన ఒప్పందం కాదని, వ్యూహాత్మకంగా రెండు దేశాలు చేతులు కలపడంతో ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడిందని అమెరికా మాజీ దౌత్యవేత్త జల్మే ఖలీజద్ వ్యాఖ్యానించారు. ఒప్పందంలో రహస్య నిబంధనలు ఏవైనా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇక సౌదీ అరేబియాకు అమెరికా భద్రతా హామీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోగలదని అభిప్రాయపడ్డారు. కాగా, సెప్టెంబర్ 9న దోహాలో హమాస్ నాయకుడు ఖలీల్ అల్-హయ్యాపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి స్పందనగా 14న ముస్లిం, అరబ్ దేశాల నాయకులు దోహాలో సమావేశమై ఇస్లామిక్ దేశాలు కూడా నాటో తరహాలో ఓ రక్షణ కూటమిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతదేశ జాతీయ భద్రత, ప్రాంతీయ సుస్థిరతపై ఈ ఒప్పందం ప్రభావాలను భారత్ అంచనావేస్తుందని ఆయన చెప్పారు. స్వీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో భారత్ పూర్తిగా కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.