Donald Trump : ట్రంప్ ట్వీట్ కలకలం.. ఏకంగా 19 దేశాల గ్రీన్ కార్డులు రద్దు?
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్ వద్ద భద్రతా సిబ్బందిపై ఒక ఆఫ్ఘన్ వ్యక్తి కాల్పులు జరిపిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి శాశ్వతంగా వలసలను నిలిపివేస్తామని బెదిరించారు. 19 దేశాల పౌరుల గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంతకీ ట్రంప్ బెదిరిస్తున్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి? ఈ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? అనే వివరాలు చూద్దాం.
వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌పై జరిగిన దాడితో ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునే వరకు థర్డ వరల్డ్ అన్ని దేశాల నుంచి శాశ్వతంగా వలసలను నిలిపివేస్తాను. నిద్రమత్తులో ఉన్న జో బైడెన్ సంతకం చేసిన అన్ని కోట్ల అక్రమ వలసదారుల పత్రాలను రద్దు చేస్తాను. అమెరికాకు విలువ తేలేని, అమెరికాని ప్రేమించలేని వారిని అందరినీ బయటకు పంపుతాను. అమెరికా పౌరులు కాని వారికి అందిస్తున్న అన్ని సబ్సిడీలు, ప్రభుత్వ సదుపాయాలను నిలిపివేస్తాను. అమెరికా శాంతికి భంగం కలిగించే, భద్రతకు ప్రమాదకరమైన, పాశ్చాత్య నాగరికతకు సరిపడని ఏ విదేశీ పౌరుడినైనా వెళ్లగొడతాను." అని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఈ పరిస్థితికి ఏకైక పరిష్కారం రివర్స్ మైగ్రేషన్ అని స్పష్టం చేశారు.
తృతీయ ప్రపంచ దేశాలు అంటే ఏంటి?
తృతీయ ప్రపంచ దేశాలు అనే పదాన్ని సాధారణంగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను సూచించడానికి ఉపయోగిస్తారు. వీటిని గ్లోబల్ సౌత్ అని కూడా పిలుస్తారు. ఈ పదబంధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, సోవియట్ రష్యా మధ్య జరిగిన కోల్డ్ వార్ సమయంలో ప్రారంభమైంది.
ఫస్ట్ వరల్డ్ అమెరికా, దాని మిత్ర దేశాలు, సెకండ్ వరల్డ్ సోవియట్ రష్యాకు మద్దతిచ్చిన కమ్యూనిస్ట్ దేశాలు, థర్డ్ వరల్డ్ ఏ కూటమితోనూ చేరని, అలీన విధానాన్ని అనుసరించిన మిగిలిన దేశాలు. కాలక్రమేణా, ఈ పదం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను సూచించడానికి వాడుకలోకి వచ్చింది. భారతదేశం కూడా ఈ థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలోనే ఉంది.
ట్రంప్ నిర్ణయం భారత్‌కు ఇబ్బందా?
ట్రంప్ తన హెచ్చరికలో ఏ దేశాలను లక్ష్యంగా చేసుకున్నారో స్పష్టంగా చెప్పకపోయినా, థర్డ్ వరల్డ్ అనే వర్గీకరణలో భారత్ కూడా ఉంది. ఒకవేళ ట్రంప్ భారతదేశాన్ని కూడా వలస నిలిపివేసే దేశాల జాబితాలో చేర్చితే, అది ప్రపంచ రాజకీయాలలో పెద్ద మార్పుకు దారితీయవచ్చు. దశాబ్దాలుగా, భారతీయ మేధావులు, విద్యార్థులు మెరుగైన జీవితం కోసం అమెరికాకు వలస వెళ్లి, అక్కడి దేశ నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ టాలెంట్ మైగ్రేషన్ నిలిచిపోతే, భారత్‌కు ప్రతికూల ప్రభావం ఉంటుంది.
మరోవైపు అమెరికా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే, వలసలు ఆగిపోవడం వల్ల దేశంలోని ప్రతిభావంతులైన వ్యక్తులు ఇక్కడే ఉండిపోతారు. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఈ తెలివైన వ్యక్తుల అవసరం చాలా ఉంది. కాబట్టి దీర్ఘకాలంలో దేశానికి ఇది ఒక విధంగా మంచి పరిణామం కావచ్చు.