Donald Trump: సౌదీ యువరాజుకు ట్రంప్ క్లీన్ చిట్.. ఖషోగ్గి హత్యతో సంబంధం లేదని స్పష్టీకరణ
స్వప్రయోజనాల కోసంమేనా ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను గట్టిగా వెనకేసుకొచ్చారు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సొంత దేశ నిఘా వర్గాల నివేదికను సైతం పక్కనపెట్టి, వైట్‌హౌస్‌లో యువరాజుకు మద్దతుగా మాట్లాడారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా ఓవల్ ఆఫీస్‌లో సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్ రిపోర్టర్ ఒకరు ఖషోగ్గి హత్య గురించి ప్రశ్నించారు. అమెరికా నిఘా సంస్థలే యువరాజు పాత్ర ఉందని నిర్ధారించాక, ఆయన్ను ఎలా నమ్మాలని అడిగారు. దీంతో ట్రంప్ వెంటనే కల్పించుకుని "ఫేక్ న్యూస్" అంటూ విరుచుకుపడ్డారు. "మీరు ప్రస్తావిస్తున్న వ్యక్తి (ఖషోగ్గి) చాలా వివాదాస్పదుడు. ఆయన్ను చాలా మంది ఇష్టపడరు. ఏదేమైనా, ఈ హత్య గురించి యువరాజుకు ఏమీ తెలియదు. మా అతిథిని ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొద్దు" అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై సౌదీ యువరాజు కూడా స్పందించారు. ఖషోగ్గి హత్య చాలా బాధాకరమని, అదొక పెద్ద తప్పిదమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తమ వ్యవస్థలను మెరుగుపరుచుకున్నామని తెలిపారు. మరోవైపు, ట్రంప్ మానవ హక్కుల విషయంలో సౌదీ ఎంతో అభివృద్ధి సాధించిందని, యువరాజు పనితీరు గర్వకారణంగా ఉందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా, అమెరికాలో సౌదీ పెట్టుబడులను 600 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు యువరాజు ప్రకటించారు. 2021లో అమెరికా నిఘా వర్గాలు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఖషోగ్గి హత్యకు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆమోదం ఉందని స్పష్టంగా ఉంది. బైడెన్ ప్రభుత్వం మొదట్లో సౌదీని 'పారియా' (వెలివేయబడిన దేశం)గా అభివర్ణించినా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగిన చమురు ధరల నేపథ్యంలో తన వైఖరిని మార్చుకుని సౌదీతో సంబంధాలను పునరుద్ధరించుకుంది. అయితే, నిఘా వర్గాల నివేదికలను తోసిరాజని ట్రంప్ సౌదీ యువరాజుకు అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.