Pakistan: పాక్ సైన్యంపై బలూచ్ మెరుపు దాడి
22 మంది పాక్ సైనికుల్ని హతమార్చిన ఫైటర్స్..;
పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్‌ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్ఓసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించింది. దీంతో, బీఎల్ఏ ఫైటర్స్ అక్కడ ఉన్న పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ దెబ్బకు పలువురు పాక్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు.
ఏప్రిల్ 29-30 మధ్య రాత్రి ప్రావిన్స్‌లోని తర్బాత్, డుక్కీ, తన్నుక్ ప్రాంతంలో బీఎల్ఏ జరిపిన దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. తెల్లవారుజామున జరిగిన దాడుల్లో పాక్ సైన్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆర్మీ కాన్వాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎల్ఏ కూడా ముగ్గురు ఫైటర్లను కోల్పోయినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్‌లోని కీలక పట్టణాలను బీఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుంది. కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది.