Joe Biden: తోబుట్టువులకు చట్టపరమైన రక్షణనిస్తూ నిర్ణయం
బైడెన్ చివరి నిర్ణయాలపై మాట్లాడతా: ట్రంప్;
అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తున్న చిట్టచివరి క్షణాల్లోనూ జో బైడెన్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకున్నారు. తన తోబుట్టువులకు, వారి జీవిత భాగస్వాములకు చట్టపరమైన రక్షణ కల్పించే ఉత్తర్వులు జారీ చేశారు. తనను బాధించే ఉద్దేశంతో వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, అవి ముగిసేలా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరాక ఎవరెవరిపై ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందో వారందరికీ కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీచేశారు.
గత కొన్నిరోజులుగా పెద్దఎత్తున క్షమాభిక్షలు, ఇలాంటి ఉత్తర్వులు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, విశ్రాంత జనరల్ మార్క్ మిలే, క్యాపిటల్ భవంతిపై 2021 జనవరి 6న జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపిన కమిటీ సభ్యులకు ఆయన ఇలాంటి రక్షణ కల్పించారు. 2020 ఎన్నికల్లో తన ఓటమికి కారకులైనవారిని, క్యాపిటల్ భవంతిపై దాడిలో తన పాత్ర ఉందని జవాబుదారీతనం నిర్ణయించడానికి ప్రయత్నించినవారిని ఓ జాబితాలో చేర్చి వారి సంగతి చూస్తానని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫౌసీ దాదాపు 40 ఏళ్లుగా అమెరికా ‘జాతీయ అలెర్జీ, అంటువ్యాధుల సంస్థ’కు డైరెక్టర్‌గా సేవలందించారు. బైడెన్‌కు ప్రధాన వైద్య సలహాదారునిగానూ ఉన్నారు. కరోనాపై స్పందన విషయంలో గతంలో ఆయన ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. మరో వ్యక్తి మిలే అమెరికాలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు విశ్రాంత ఛైర్మన్. గతంలో ఆయన ట్రంప్‌ను ఫాసిస్టుగా అభివర్ణించారు. తాను రక్షణ, క్షమాభిక్ష కల్పిస్తున్నవారంతా ఏదో తప్పులు చేసినట్లో, వాటిని అంగీకరించినట్లో కాదని బైడెన్ స్పష్టంచేస్తున్నారు.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. బైడెన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ నిర్ణయాలపై నేను మాట్లాడబోతున్నాను. చాలా పెద్ద నేరాలకు పాల్పడిన వారికి ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.