USA: అమెరికా సెనేట్ భవనాల్లోకి సాయుధుడు!
క్యాపిటల్ సెనేట్ భవనాల్లోకి ఆయుధాలు ధరించిన వ్యక్తి ప్రవేశించాడని సమాచారం.. పోలీసుల తీవ్ర గాలింపు...;
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ సెనేట్ భవనాల్లోకి(Senate Buildings) ఆయుధాలు కలిగి ఉన్న ఓ అగంతకుడు(active shooter) ప్రవేశించినట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు( US Cops) అప్రమత్తమయ్యారు. ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్ సెనేట్ భవనాల్లో (Senate office buildings) సంచరిస్తున్నట్లు 911కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కాల్( Call) రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వాషింగ్టన్ పోలీసులు చట్టసభ భవనాలు సహా పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. సెనేట్ భవనం లోపలి సిబ్బందిని బయటకు తరలించారు. సమీపంలోని ప్రజలందర్నీ ఇళ్లలోనే ఉండాల్సిందిగా సూచించారు. డజన్ల కొద్దీ పోలీసు వాహనాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలీక స్థానికులు గందరగోళానికి గురయ్యారు. అయితే ప్రాథమికంగా ఎటువంటి తుపాకీ కాల్పుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
రస్సెల్ సెనేట్ భవనం, ఇతర సెనెట్ భవనాల్లో జల్లెడ పట్టిన తర్వాత సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తీవ్ర గాలింపుల తర్వాత ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని, సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని, భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు ప్రకటించారు. భయభ్రాంతులు సృష్టించేందుకు బెదిరింపు ఫోన్(Bogus Call) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు(investigation continues ) తెలిపారు.