UPI : ఇజ్రాయెల్‌లోనూ మన యూపీఐ మ్యాజిక్.. ప్రధాని మోదీ పర్యటనలో చారిత్రాత్మక ఒప్పందం.
UPI : భారతదేశం గర్వించదగ్గ డిజిటల్ విప్లవం యూపీఐ ఇప్పుడు ఖండాలు దాటి మధ్యప్రాచ్య దేశమైన ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇకపై ఇజ్రాయెల్‌లో కూడా మన యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఇరు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. మన రూపాయి విలువను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఇదొక కీలక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్‌కు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు పెద్ద ఊరట లభించనుంది. అక్కడికి వెళ్లినప్పుడు కరెన్సీ మార్పిడి కోసం తిప్పలు పడాల్సిన పనిలేదు. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డులపై పడే భారీ సర్వీస్ ఛార్జీల భారం కూడా తప్పుతుంది. మన దేశంలో ఎలాగైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్ ద్వారా డబ్బులు చెల్లిస్తామో, అదే విధంగా ఇజ్రాయెల్‌లో కూడా నిమిషాల్లో సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు.
ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఈ భేటీ రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో మెట్టు ఎక్కించింది. కేవలం డిజిటల్ పేమెంట్స్ మాత్రమే కాకుండా, రక్షణ, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, అణుశక్తి రంగాల్లో కూడా భారీ ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాల తయారీలో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది మన దేశ రక్షణ అవసరాలకు చాలా కీలకం కానుంది.
తీవ్రవాదంపై ఇరు దేశాల నేతలు కఠిన వైఖరిని ప్రదర్శించారు. సభ్య సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని, దాన్ని పెంచి పోషించే దేశాలకు బుద్ధి చెప్పాలని మోదీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ చేపడుతున్న సంస్కరణలను, పరిపాలన దక్షతను వేనోళ్ల కొనియాడారు. ఐఎంఈసీ, ఐ2యు2 వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్-ఇజ్రాయెల్ కలిసి ప్రయాణించడం ప్రపంచ గమనాన్నే మార్చేలా ఉంది.