BRICS 2026 : విశ్వగురువుగా భారత్ మరో అడుగు..బ్రిక్స్ 2026 అజెండాను ఖరారు చేసిన మోదీ సర్కార్.
BRICS 2026 : బ్రిక్స్ కూటమికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్, ఢిల్లీ వేదికగా తన కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించింది. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో దేశ రాజధానిలో జరిగిన బ్రిక్స్ షెర్పాలు, సూస్ షెర్పాల తొలి సమావేశం విజయవంతంగా ముగిసింది. ప్రపంచ గతిని మార్చే కీలక నిర్ణయాలకు ఈ భేటీ పునాది వేసింది. భారత బ్రిక్స్ షెర్పా సుధాకర్ దలేలా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పది సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 అధ్యక్ష పదవి కోసం భారత్ బిల్డింగ్ ఫర్ రెజిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ(స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం స్థిరత్వం కోసం నిర్మాణం) అనే ప్రత్యేక థీమ్‌ను ప్రకటించింది. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా ఆరోగ్యం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సభ్యదేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని భారత్ ఆకాంక్షించింది.
బ్రిక్స్ అంటే కేవలం దౌత్యవేత్తల సమావేశం మాత్రమే కాకూడదని, ఇది ప్రజలతో ముడిపడి ఉండాలని భారత్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా క్రీడల్లో సహకారం, యువతను అనుసంధానించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, మహిళా పారిశ్రామికవేత్తల కూటమిని బలోపేతం చేయడంపై ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చారు. భారత్ ప్రతిపాదించిన ఈ పీపుల్ సెంట్రిక్(ప్రజల ఆధారిత) విధానాన్ని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా అభినందించాయి. ఇది కూటమిని మరింత శక్తివంతం చేస్తుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 10న బ్రిక్స్ దేశాల షెర్పాలు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌ను కలిశారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ పాత్రను ఆయన వారికి వివరించారు. సమావేశాల అనంతరం విదేశీ ప్రతినిధులు ఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం, హస్తకళా అకాడమీ మరియు ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సంస్కృతి, కళాకారుల నైపుణ్యాన్ని చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటన భారత్ సాఫ్ట్ పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది.
2026 సంవత్సరం అంతా భారత్ వివిధ స్థాయిల్లో బ్రిక్స్ సమావేశాలను నిర్వహించనుంది. వివిధ శాఖల మంత్రులు, నిపుణులు తరచూ భేటీ అవుతూ కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, క్లైమేట్ చేంజ్, ఆర్థిక లావాదేవీల్లో సభ్యదేశాల మధ్య కరెన్సీ వాడకం వంటి అంశాలపై ఈ ఏడాది లోతైన చర్చలు జరగనున్నాయి. భారత్ నాయకత్వంలో బ్రిక్స్ కూటమి ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.