Charlie Kirk: ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన
తన భర్తను చంపిన నిందితుడిని క్షమించేస్తున్నట్లు వెల్లడి
తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరికా ప్రకటించారు. దీంతో సంతాప కార్యక్రమానికి హాజరైన వారంతా స్టాండింగ్ ఒవేషన్ చేశారు. ఎరికా ప్రకటనను అందరూ స్వాగతించారు. చార్లీ కిర్క్‌ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్‌లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10 వేల మంది హాజరయ్యారు. ట్రంప్ సహా ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎరికా ప్రసంగిస్తూ.. బైబిల్‌లోని కొన్ని వాక్యాలను ఉదహరిస్తూ.. తన భర్త కూడా శత్రువుల పట్ల ప్రేమను, హింసించే వారి పట్ల ప్రేమను చూపిస్తారని.. అలాగే తన భర్తను చంపిన వ్యక్తిని కూడా తాను కూడా క్షమించేస్తున్నానని ప్రకటించారు. దీంతో అందరూ నిలబడి స్వాగతించారు. ఇక స్టేజీపై ట్రంప్‌ను ఎరికా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో ఎరికాను ట్రంప్ దగ్గరగా తీసుకుని ఓదార్చారు.
ఎవరీ ఎరికా కిర్క్..
ఎరికా కిర్క్ ఒక వ్యాపారవేత్త, మాజీ మిస్ అరిజోనా యూఎస్ విజేత. 2018లో చార్లీ కిర్క్‌ను కలిశారు. అనంతరం 2021లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఏడేళ్ల కొడుకు, మూడేళ్ల కుమార్తె ఉంది. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ ప్రసంగిస్తుండగా తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక తన భర్త స్థాపించిన టర్నింగ్ పాయింట్ యూఎస్‌ను కొనసాగిస్తానని ఎరికా ప్రకటించారు. 22 ఏళ్ల రాబిన్సన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక స్మార కార్యక్రమానికి గట్టి భద్రత ఏర్పాటుచేశారు. ట్రంప్, మస్క్, ఇతర వ్యక్తులంతా గాజు ప్యానెల్ వెనుక నుంచి ప్రసంగించారు. ఈ తరం దిగ్గజం అంటూ ట్రంప్ ప్రశంసించారు. చార్లీ కిర్క్ చరిత్ర గమనాన్ని మార్చడని.. దేశం శోకంలో ఉందని జేడీ వాన్స్ పేర్కొన్నారు.