China : ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్లు వాడొద్దు
చైనాలో యాపిల్‌కు భారీ దెబ్బ!;
చైనా తయారీ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంపై ఇంతవరకు ఇతర దేశాలు భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేయగా ఇప్పుడా భయం డ్రాగన్‌కు పట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు, విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం. వాటిని కార్యాలయాలకూ తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా ప్రభుత్వానికి చెందిన ఉన్నతోద్యోగులు కిందిస్థాయి ఉద్యోగులకు కొన్నిరోజులక్రితం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.యాపిల్ సహా ఇతరదేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. ఈ విషయమై చైనా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు.
ఇది కొత్త విధానం విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశం నుంచి సున్నితమైన సమాచార ప్రవాహాన్ని పరిమితం చేయడానికి చైనా చేసిన ప్రయత్నమని సమాచారం. చాట్ గ్రూపులు లేదా సమావేశాల ద్వారా కార్యాలయంలోకి అలాంటి పరికరాలను తీసుకురావద్దని కొన్ని కేంద్ర ఏజెన్సీలలోని ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ అయినట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొంది. అయితే యాపిల్‌తో పాటు ఏయే ఫోన్లను తీసుకురావొద్దన్నది ఉత్తర్వు పేర్కొందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని ఏజెన్సీలలోని ప్రభుత్వ అధికారులను ఐఫోన్‌లను ఉపయోగించకుండా చైనా అనేక సంవత్సరాల పాటు నిషేధించింది. అయితే తాజా ఆర్డర్ ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చేయడానికి ప్రయత్నించింది.
యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి . యాపిల్‌కు దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఎక్కువగా స్వదేశీ బ్రాండ్ ఫోన్లనే వాడాలని ప్రోత్సహించే దిశగా చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా భావిస్తున్నారు. చైనీస్ టెక్ దిగ్గజం బెహమోత్ హవాయ్ సరికొత్త మోడల్ మేట్ 60 సిరీస్ చైనాలో యాపిల్ మార్కెట్ షేర్‌ను పంచుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో బాన్ చేసిన అమెరికన్ కంపెనీల నుంచి చైనా కంపెనీలకు సాఫ్ట్‌వేర్, ఎక్విప్‌మెంట్ అమ్మడాన్ని బ్యాన్ చేసిన తర్వాత హవాయ్ కంపెనీ చేస్తున్న లాంఛ్ కు ప్రత్యేకత సంతరించుకుందని నిపుణులు పేర్కొన్నారు.