Dalai Lama : టిబెటన్ల మనోబలం చైనాకి తెలిసొచ్చింది
చైనాతో చర్చలకు సిద్ధమన్న దలైలామా;
చైనా తనతో మాట్లాడాలి అనుకుంటే తను అందుకు పూర్తి సమ్మతమని అన్నారు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అలా అని టిబెట్ స్వాతంత్య్రం కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు ఆయన. దలైలామా 88వ పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత ధర్మశాలలో ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని చైనా గ్రహించిందని, చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని, తాను అందుకు స్థిరంగా, సుముఖంగా ఉన్నాను అన్నారు. తాము స్వాతంత్రం కోరుకోవడం లేదని, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగానే ఉండాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నామన్నారు. కానీ ఇప్పుడు చైనా మారుతోందన్నారు . అధికారికంగానో లేదా అనధికారికంగానో చైనీయులు తనను సంప్రదించాలనుకుంటున్నారన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, టిబెట్ పట్ల కఠిన వైఖరిగల చైనా నేతలపై కూడా తనకు కోపం లేదని చెప్పారు. నిజానికి చారిత్రకంగా చైనా బౌద్ధ దేశమని చెప్పారు. తాను చైనాలో పర్యటించినపుడు అనేక దేవాలయాలు, మఠాలను చూశానని చెప్పారు. టిబెట్ సంస్కృతి, మతానికి సంబంధించిన విజ్ఞానం వల్ల ప్రపంచం లబ్ధి పొందుతుందని చెప్పారు. అయితే తాను ఇతర మతాల సంప్రదాయాలను కూడా గౌరవిస్తానని చెప్పారు. ఎందుకంటే ప్రేమ, కారుణ్యాలను పెంచుకోవాలని ఆయా మతాలు తమ అనుచరులకు చెప్తున్నాయన్నారు.
దలైలామా.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బౌద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా. అహింసాయుతంగా టిబెట్ స్వాతంత్రం కోసం ఆయన చాలా కాలం పోరాడుతూనే ఉన్నారు. చైనా టిబెట్‌ను ఆక్రమించుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించడంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కక్షగట్టింది. దీంతో 1959లో అక్కడ నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు బౌద్ధ గురువు.
జూన్ 6, 1935న లామో తొండప్‌గా జన్మించిన ఇతను రెండు సంవత్సరాల తరువాత దలైలామా యొక్క 14వ అవతారంగా గుర్తించబడ్డాడు. అప్పటినుండి అదే పేరుతో పిలవబడుతున్నారు. తరువాత అతనిని టిబెట్ రాజధాని లాసా యొక్క పవిత్ర నగరానికి తరలించారు. అయితే అక్టోబరు 1950లో, వేలాది మంది చైనా సైనికులు టిబెట్‌లోకి ప్రవేశించి దానిని చైనాలో భాగమని ప్రకటించారు. తరువాతి కొన్ని సంవత్సరాలలో, బీజింగ్ టిబెట్‌పై తన పట్టును బిగించింది. మరోవైపు చైనా పాలనపై టిబెట్‌లో ప్రతిఘటన మొదలైంది.
దలైలామా వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టిబెట్‌ను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని చైనా ఆరోపించింది. పరిస్థితులు అస్థిరంగా మారడంతో, దలైలామా 1959లో తన జన్మ భూమిని వదిలి భారతత్ కు వచ్చేసారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించారు. అప్పటి నుంచి అతను హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని మెక్‌లియోడ్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.