China K Visa: హెచ్‌1బీ తరహాలో కే వీసా ప్రకటించిన చైనా ప్రభుత్వం

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి చైనా “K వీసా”

Update: 2025-09-23 02:35 GMT

 ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తు్న్నాను అనుకుంటున్న అమెరికా తలబిరుసు తనంతో తన ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోయే ప్రమాద స్థితికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రపంచానికి తదుపరి పెద్దన్న పాత్రను పోషించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చైనా.. ఇదే మంచి సమయం అనుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై ఒకేసారి $100,000 రుసుము విధించాలనే నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని చైనా రెండు చేతులతో అందిపుచ్చుకుంటుంది. తాజాగా డ్రాగన్ దేశం తన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి కృషి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేలా సరికొత్తగా “K వీసా”ను ప్రారంభించింది. ఇంతకీ చైనా కే వీసా కథ ఏంటి, ఇది అమెరికాకు ఏ విధంగా నష్టం చేస్తుంది.. అలాగే భారత్‌కు దీనితో ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి చైనా “K వీసా”

చైనా కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ వీసా అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది. STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలలోని నిపుణులకు ఈ వీసా ద్వారా చైనా తలుపు తెరుస్తుంది. ఆగస్టు 7, 2025న చైనా స్టేట్ కౌన్సిల్ విదేశీయుల ప్రవేశ, నిష్క్రమణ నిబంధనలను సవరిస్తూ ఆర్డర్ నంబర్ 814ను జారీ చేసింది. K వీసాను ఇప్పుడు 12 వర్గాల సాధారణ వీసాలలో 13వ వర్గంగా చేర్చారు. పలు నివేదిక ప్రకారం.. ఈ వీసా ప్రత్యేకంగా యువ విదేశీ సైన్స్, టెక్నాలజీ ప్రతిభావంతుల కోసం రూపొందించినట్లు సమాచారం. ఇది STEM రంగాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుంచి పట్టభద్రులైన బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్న యువకుల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న వీసా అని చెబుతున్నారు. ఈ K వీసా ప్రత్యేకత ఏమిటంటే దీనికి స్థానిక స్పాన్సర్‌షిప్ అవసరం లేకపోవడం. దరఖాస్తుదారుడి వయస్సు, స్టడీ రికార్డు లేదా వృత్తిపరమైన అనుభవం ఆధారంగా వారి అర్హత నిర్ణయించనున్నారు. ఈ వీసాకు చైనాలో దీర్ఘకాలిక చెల్లుబాటు వ్యవధి ఉండటంతో పాటు, బహుళ ఎంట్రీలను అనుమతిస్తుండటం సానుకూల అంశం అంటున్నారు.

చైనా నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం.. 2025 మొదటి అర్ధభాగంలో చైనాలో విదేశీ ప్రయాణికుల సంఖ్య 38.05 మిలియన్లు. ఇది గత సంవత్సరం కంటే 30.2 శాతం ఎక్కువ. K వీసాలతో ఈ సంఖ్యను మరింత పెరుగుతాయని డ్రాగన్ ప్రభుత్వం భావిస్తుంది. H-1B వీసాలకు సంబంధించి ట్రంప్ పరిపాలన నిర్ణయం ముఖ్యంగా భారతీయులను ప్రభావితం చేస్తోంది. ప్రతి సంవత్సరం భారతీయులు 72 శాతం H-1B వీసాలను పొందుతారు. ట్రంప్ తన చర్యను అమెరికన్ కార్మికులను రక్షించడానికి ఒక సాధనంగా ప్రచారం చేశారు. కానీ ఈ చర్య దక్షిణాసియా ప్రతిభను అమెరికా నుంచి ఇతర దేశాలకు తీసుకెళ్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా చైనా ప్రవేశపెట్టిన K వీసా, భారతీయ టెకీలకు చైనాను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మార్చగలదని పలు నివేదికలు ఊటంకిస్తున్నాయి.

చైనా నిర్ణయం భారతదేశానికి లాభమా..

H-1B వీసాలు బదులుగా ఏర్పడిన చైనా K వీసాలు అగ్రశ్రేణి భారతీయ ప్రతిభను డ్రాగన్ దేశానికి తీసుకువెళ్లగలవని పలు నివేదికలు తెలుపుతున్నాయి. స్టడీపోర్టల్స్ డేటా ప్రకారం 2025లో USలో AI డిగ్రీలకు డిమాండ్ 25 శాతం తగ్గితే, అదే సమయంలో చైనాలో 88 శాతం పెరిగింది. K వీసాలు అంతర్జాతీయ STEM మార్పిడిని ప్రోత్సహిస్తాయని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ సెక్రటరీ జనరల్ మియావో అన్నారు. మొత్తంమీద చైనా K వీసా రాకతో భారతదేశం లాంటి దేశాల అగ్రశ్రేణి యువత ఇప్పుడు అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ అగ్రశ్రేణి ప్రతిభ గల యువతను వలస వెళ్లకుండా నిలువరించడానికి కూడా ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయాలనే అభిప్రాయాలు దేశ ప్రజల నుంచి బలంగా వినిస్తున్నాయి.

Tags:    

Similar News