Canada: భారత్ పై మళ్లీ నోరుపారేసుకున్న కెనడా
మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం..;
భారత్‌పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. ఆ దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. భారత్‌తోపాటు చైనా, రష్యా, పాకిస్థాన్ దేశాలు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వానెస్సా లాయిడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘త్వరలో మా దేశంలో జరగబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం, సామర్థ్యం భారత ప్రభుత్వానికి కూడా ఉందని మేం భావిస్తున్నాం. రష్యా, పాకిస్థాన్ దేశాల కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చు’ అని లాయిడ్ ఆరోపించారు.
కాగా.. గతంలో కెనడా ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2019, 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్, పాకిస్థాన్ దేశాలు జోక్యం చేసుకున్నట్లు కెనడా సెక్యూటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపణ చేసింది. ఈ ఆరోపణలపై ఆ దేశం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భారత్ జోక్యం చేసుకోలేదని తేలింది. కెనడా(Canada) ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణాధికారులు వెల్లడించారు.
2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొన్నది. అయితే గత రెండు ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు గతంలో వచ్చిన ఆరోపణలను ఇండియా అప్పట్లోనే కొట్టిపారేసింది. ఇతర ప్రజాస్వామ్య దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి భారత్‌పై ఒట్టావా అలాంటి ఆరోపణలే చేయడం గమనార్హం.
కెనడాలో మధ్యంతర ఎన్నికలు..
కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వచ్చేనెల 28న మొత్తం 343 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై విధిస్తున్న సుంకాల అంశమే ఈ సారి ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే ప్రధాని కార్నీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేత పియరీ పోలీవర్ ప్రచారం ప్రారంభించారు. దాదాపు 37 రోజుల పాటు ప్రచారం జరుగనుంది. తొమ్మిదేండ్లపాటు దేశాన్ని పాలించిన జస్టిన్ ట్రుడో స్థానంలో కొత్త ప్రధానిగా ఈ నెల 14న కార్నీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ విధిస్తున్న సుంకాల అంశాన్నే తొలి రోజు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తారు. కెనడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
కెనడాలో బ్యాలెట్ పేపర్‌పై జస్టిన్ ట్రుడో లేకుండా ఎన్నికలు జరుగడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు అధికారం కోసం హోరాహోరీ తలబడుతున్నాయి. కాగా, ప్రధానిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నాయకుడు ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.