Pangong Lake Bunkers: భారత్ సరిహద్దులో చైనా కొత్త బంకర్లు
మరోసారి బయటపడిన డ్రాగన్ వక్ర బుద్ధి
సమయం వచ్చిన ప్రతి సారి భారత్‌కు వ్యతిరేకంగా చైనా పావులు కదుపుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఏమిటంటే.. 2020 భారత్ – చైనా మధ్య ఘర్షణ జరిగిన ప్రదేశం నుంచి కేవలం 110 కి.మీ దూరంలో డ్రాగన్ దేశం కొత్త వైమానిక రక్షణ సముదాయాన్ని నిర్మించినట్లు సమాచారం. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు తీరంలో ఈ నిర్మాణం వేగంగా జరుగుతోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత సరిహద్దు సమీపంలో చైనా కొత్త వైమానిక రక్షణ సముదాయాన్ని నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలు సైతం వెల్లడించాయి.
నైమా ఎయిర్‌ఫీల్డ్‌కు ముప్పు
ఈ చిత్రాల్లో చైనా నిర్మించిన సురక్షితమైన క్షిపణి లాంచర్ సైట్‌లు కనిపిస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి ఇది ఒక కొత్త ప్రయత్నంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చెందిన నైమా ఎయిర్‌ఫీల్డ్‌కు దీంతో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. చైనా గార్ కౌంటీలో కొత్త వైమానిక రక్షణ కేంద్రం నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. US కంపెనీ ఆల్‌సోర్స్ అనాలిసిస్ (ASA) పరిశోధకులు మొదట చైనా నిర్మించిన క్షిపణి లాంచర్ డిజైన్‌ను గుర్తించారు. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ భవనం, బ్యారక్‌లు, వాహన షెడ్‌లు, ఆయుధాల నిల్వ చేసుకునే గది, రాడార్ సైట్‌లు ఉన్నాయి.
ముఖ్యంగా ఇవి ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ (TEL) వాహనాల కోసం స్లైడింగ్ రూఫ్‌లతో కప్పిన క్షిపణి ప్రయోగ స్థానాలుగా వాళ్లు పేర్కొన్నారు. ఈ వాహనాలు సుదూర HQ-9 ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి (SAM) వ్యవస్థలను మోసుకెళ్లి, పైకి లేపి, కాల్చివేస్తాయని చెప్పారు. ఈ బంకర్‌లు క్షిపణులను దాచిపెట్టి, దాడి నుంచి రక్షించడానికి రూపొందించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పాంగోంగ్ సరస్సు తూర్పు అంచున కూడా ఇలాంటి సముదాయాన్నే నిర్మిస్తున్నారు. అక్కడ కూడా ఇవే సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
US స్పేస్ ఇంటెలిజెన్స్ కంపెనీ వెంటర్ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ లాంచ్ బేల పైకప్పులు జారిపోతున్నాయని నిర్ధారించాయి. ప్రతి బే లో రెండు వాహనాలను ఉంచవచ్చు. ఒక చిత్రం పైకప్పు తెరిచి ఉన్నట్లు చూపించింది, బహుశా లాంచర్లను బహిర్గతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ.. ఈ పైకప్పులకు హాచ్‌లు ఉన్నాయని చెప్పారు. వీటిలో లాంచర్లు దాగి ఉంటాయని, దాడి సమయంలో, క్షిపణులను విడుదల చేయడానికి పైకప్పులు తెరుచుకుంటాయని చెప్పారు. ఇవి TELలు ఎక్కడ ఉన్నాయో శత్రువు తెలుసుకోకుండా చేస్తాయని, అలాగే దాడి నుంచి రక్షణను కూడా అందిస్తాయని వెల్లడించారు. వాస్తవానికి పాంగోంగ్ కాంప్లెక్స్ ప్రారంభ నిర్మాణాన్ని జూలై చివరలోనే జియోస్పేషియల్ పరిశోధకుడు డామియన్ సైమన్ గుర్తించారు. కానీ ఆ సమయంలో క్షిపణి బంకర్లను ఇంకా వెలికితీయలేదని, పాంగోంగ్ సమీపంలో పని ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.
దీంతో భారత్‌కు ప్రమాదం ఎంత ?
చైనా కొత్త బంకర్లు డ్రాగన్ దేశ వైమానిక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లడఖ్, తూర్పు లడఖ్‌లో న్యోమా ఎయిర్‌ఫీల్డ్ భారతదేశానికి కీలకమైన సైనిక వైమానిక స్థావరంగా వాళ్లు పేర్కొన్నారు. ఈ బంకర్లు గార్ కౌంటీకి ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా తన సరిహద్దు రక్షణను బలోపేతం చేస్తోందని చెప్పారు. భారతదేశం కూడా తన నిఘాను పెంచాల్సి ఉంటుందని, చైనా సన్నాహాలు తీవ్రంగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా వెల్లడించాయి నిపుణులు హెచ్చరించారు.