Chikungunya: చైనాలో చికున్‌గునియా .. ఎంతలా ఉందంటే ..

ఏడు వేల కేసులు న‌మోదు;

Update: 2025-08-06 01:45 GMT

 చైనాలో చికున్‌గునియా వైర‌స్‌ కేసులు న‌మోదు అవుతున్నాయి. గువాంగ్‌డాంగ్ ప్రావిన్సులో జూలై నుంచి సుమారు ఏడువేల కేసులు రికార్డు అయ్యాయి. దీంతో చైనీస్ అధికారులు.. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి త‌ర‌హాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోష‌న్ సిటీలో అధిక సంఖ్య‌లో చికున్‌గునియా పేషెంట్లు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ రోగుల బెడ్ల‌కు దోమ‌తెర‌ల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల‌ను డిశ్చార్జ్ చేయ‌నున్నారు. లేదంటే క‌నీసం వారం రోజుల పాటు ఆస్ప‌త్రిలో స్టే చేయాల్సి ఉంటుంది.

ఇన్‌ఫెక్ష‌న్ సోకిన దోమ కాటు వ‌ల్ల‌ చికున్‌గునియా వైర‌స్ వ్యాపిస్తుంది. ఈ వైర‌స్ వ‌ల్ల జ్వ‌రం, తీవ్ర నొప్పులు వ‌స్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆ నొప్పులు ఏళ్ల పాటు ఉంటాయి. నిజానికి చైనాలో చికున్‌గునియా కేసులు త‌క్కువే, కానీ ద‌క్షిణాసియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో చికున్‌గునియా కేసులు ఎక్కువ‌. తాజాగా ఫోష‌న్ సిటీతో పాటు మ‌రో 12 సిటీల్లో ఇన్‌ఫెక్ష‌న్లు న‌మోదు అయ్యాయి. ఫోష‌న్ వెళ్లివ‌చ్చిన హాంగ్‌కాంగ్ పిల్లోడికి వైర‌స్ సోకిన‌ట్లు ఆ దేశం చెప్పింది.

చికున్‌గునియా కేసుల్లో 95 శాతం రోగుల‌కు స్వ‌ల్ప స్థాయి ల‌క్ష‌ణాలు న‌మోదు అయ్యాయి. వారం రోజుల్లో వాళ్లు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చైనాలో చికున్‌గునియా కేసులు వ్యాప్తి కావ‌డంతో.. అమెరికా త‌మ ప్ర‌యాణికుల‌కు హెచ్చ‌రిక జారీ చేసింది. చైనా టూరులో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. జ్వ‌రం, కీళ్ల నొప్పులు, ర్యాషెస్ వ‌చ్చిన వాళ్లు త‌క్ష‌ణ‌మే ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News