Chang’e-6: భూమికి బయల్దేరిన చైనా లూనార్ ప్రోబ్
చరిత్ర సృష్టించిన చాంగే-6;
చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్.. అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్ బయలుదేరినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) మంగళవారం ప్రకటించింది. చంద్రుని ఆవలి ప్రాంతంలో గత రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6.. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటల 38 నిమిషాలకు చంద్రుని ఉపరితలం నుంచి బయల్దేరిందని, అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలను ఇది సమర్థంగా తట్టుకోగలిగిందని సీఎన్‌ఎస్‌ఏ పేర్కొన్నట్టు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ నెల 25న చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ ప్రోబ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. చరిత్రాత్మకమైన ఈ ఫీట్‌తో ఇప్పటివరకూ ఎవరూ అన్వేషించని చంద్రుని చీకటి భాగం నుంచి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా నిలువనున్నది.