Rare Earth : చైనా బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్..టెక్నాలజీ యుద్ధంలో జపాన్ సంచలన ముందడుగు.

Update: 2026-01-13 06:30 GMT

Rare Earth : స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక క్షిపణులు.. ఇలా నేటి కాలంలో మనం వాడుతున్న ప్రతి హైటెక్ వస్తువు తయారీలో రేర్ ఎర్త్ మెటల్స్ అత్యంత కీలకం. ఇప్పటివరకు ఈ ఖనిజాల సరఫరాలో చైనానే రారాజు. ఈ ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకుని చైనా ఇతర దేశాలను తరచుగా బెదిరిస్తూ వస్తోంది. అయితే, ఈ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు భారత్ మిత్రదేశమైన జపాన్ ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. టోక్యోకు సుమారు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినమిటోరి ద్వీపం సమీపంలోని సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జపాన్ గుర్తించింది.

ఈ భారీ మిషన్ కోసం జపాన్ చిక్యూ అనే భారీ పరిశోధనా నౌకను రంగంలోకి దించింది. ఈ నౌక సముద్ర మట్టానికి ఏకంగా 6 కిలోమీటర్ల (సుమారు 4 మైళ్లు) లోతుకు వెళ్లి, అక్కడ పేరుకుపోయిన ఖనిజయుక్తమైన బురదను వెలికితీస్తుంది. ఇంతటి లోతు నుంచి నిరంతరాయంగా ఖనిజాలను సేకరించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ నౌకలో 130 మంది నిపుణులు, శాస్త్రవేత్తల బృందం ఉంది. వీరంతా ఫిబ్రవరి 14 నాటికి తమ పరిశోధనలు పూర్తి చేసి తిరిగి వస్తారు. సముద్రపు అడుగున ఉన్న ఈ బురదలో ప్రపంచ అవసరాలకు సరిపడా అరుదైన ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.

జపాన్ ఎందుకు ఇంతటి సాహసానికి పూనుకుంది అంటే.. దానికి కారణం చైనా అనుసరిస్తున్న మొండి వైఖరే. దౌత్యపరమైన వివాదాలు వచ్చిన ప్రతిసారీ చైనా తన వద్ద ఉన్న రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ జపాన్ మరియు ఇతర పాశ్చాత్య దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత వారమే జపాన్ మిలిటరీ, పౌర అవసరాలకు వాడే కొన్ని ప్రత్యేక ఖనిజాలపై చైనా నిషేధం విధించింది. ఈ టెక్నాలజీ యుద్ధంలో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని జపాన్ గత ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తోంది. ఈ మిషన్ గనుక విజయవంతమైతే, టెక్నాలజీ రంగంలో చైనా గుత్తాధిపత్యానికి శాశ్వతంగా తెరపడినట్లే.

ఈ ప్రాజెక్టు వెనుక జపాన్ ప్రభుత్వం ఏడేళ్ల పాటు కఠోర శ్రమ చేసింది. షిజుయోకా పోర్టు నుంచి చిక్యూ నౌక బయలుదేరినప్పుడు ప్రాజెక్టు హెడ్ షోయిచి ఇషీ భావోద్వేగానికి గురయ్యారు. సముద్ర గర్భం నుంచి వనరులను వెలికితీయడం అనేది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, అది జపాన్ ఆత్మగౌరవానికి, భద్రతకు సంబంధించిన విషయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నిక్షేపాలు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా, సరఫరా గొలుసులో చైనా పెత్తనం పూర్తిగా అంతమైపోతుంది. జపాన్ సాధించిన ఈ విజయం చూసి ఇప్పుడు బీజింగ్ పాలకులు హడలిపోతున్నారు.

Tags:    

Similar News