Chinese Lunar Lander : చంద్రునిపై నుంచి 2 కేజీల మట్టి తేనున్న చైనా ల్యాండర్

Update: 2024-06-03 07:09 GMT

చైనాకు చెందిన ల్యూనార్ ల్యాండర్ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలి వైపు ల్యాండ్ అయినట్టు ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం అయిట్కిన్ బేసిన్ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు.

ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిల్లో ఇదే అత్యాధునికమైంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనుంది. గతంలో 2019లో కూడా చైనా చాంగే - 4ను చంద్రుడి ఆవలివైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్ అనే నాలుగు రకాల పరికరాలున్నాయి. మే 3వ తేదీ చాంగే-6 నింగికెగిరి... దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. అక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టిని ఇది భూమిపైకి తీసుకురానుంది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది.

ఆ తర్వాత అసెండర్ మాడ్యూల్.. చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళుతుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్ అనుసంధానమవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్లోని రీఎంట్రీ మాడ్యూల్లోకి చేరుతాయి. భూమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్.. ఆర్బిటర్ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో రీ ఎంట్రీ మాడ్యూల్ దిగుతుంది.

Tags:    

Similar News