ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై దర్యాప్తు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఐరాసలో తనకు ఏకంగా మూడు సార్లు అవమానం ఎదురైందని ఆయన వెల్లడించారు. మొదట తాను ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయిందన్న ఆయన.... తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయలేదన్నారు. అయినప్పటికీ తన ప్రసంగానికి అద్భుత రివ్యూలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్... ఘోరంగా ఉందన్నారు. తాను మాట్లాడిన తర్వాత భార్య మెలానియా వైపుచూస్తే..ఒక్క ముక్క కూడా వినిపించలేదని చెప్పారని తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదన్న ఆయన.... మూడు లోపాలపై దర్యాప్తు చేపట్టాలని... ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కు లేఖ రాస్తానని చెప్పారు. దీనిలో సీక్రెట్ సర్వీస్ ను..భాగస్వామిని చేయాలన్నారు. అమెరికా అధ్యక్షుడి బృందంలోని ఒక వీడియో గ్రాఫర్ ట్రంప్ ను చిత్రీకరిస్తూ.. పొరబాటున ఎస్కలేటర్ సేఫ్టీ వ్యవస్థను నొక్కడం వల్లే ఆగిపోయి ఉండొచ్చని.... ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.