బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) తీర్పు సంచలనంగా మారింది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేరాల ఆరోపణలు నిజమే అని తేల్చిన కోర్టు ఉరిశిక్షను విధించింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఉద్యమంపై ఆమె హింసాత్మక చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు, డ్రోన్లు, హెలికాప్టర్‌లు, ప్రాణహానికరం కలిగించే ఆయుధాలు వాడి సామాన్యులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తేలింది. 453 పేజీల తీర్పు ఇచ్చింది కోర్టు. హసీనా ఆస్తుల జప్తుకు ఆదేశించింది. తీర్పుపై హసీనా స్పందించింది. ఇదంతా రాజకీయ ప్రేరణతో కూడిన తీర్పుగా ఖండించింది. ICT ఒక నకిలీగా భావించే కోర్ట్. ఇది “ఒక్క పార్టీని అణచివేయడం కోసం” పనిచేస్తోందని ఆరోపించింది హసీనా.
హసీనా తన వాదన సమర్థించుకునే విధంగా మాట్లాడుతోంది. ఇది అన్యాయమైన తీర్పు అని ఆరోపిస్తోంది. అయితే హసీనాకు మరణశిక్షపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అహంకారం ఎక్కువైతే ఇలాంటి పరిణామాలు తప్పవు” అని అంటున్నారు. ఇంకొందరు హసీనా చేతులు రక్తంతో తడిచాయని.. ఆమెకు కూడా అలాంటి గతి పట్టాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం, ఆమెపై తీర్పు రాజకీయంగా ప్రేరేపితమై ఉంటే.. నిష్పక్షపాత విచారణ జరగాలంటున్నారు.
ఏదేమైనా సరే హసీనాకు ఉరిశిక్ష ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏ దేశంలో అయినా సరే ప్రజలపై తీసుకునే నిర్ణయాలు అహంకార పూరితంగా ఉంటే చివరకు ఇదే గతి పడుతుందనే వాదన వినిపిస్తోంది. మనం గతంలో ఎన్నో చూశాం. అహంకారం ఎక్కువైతే మహా మహులే మట్టికొట్టుకుపోయారు. ప్రజలు తిరగబడితే ఎవ్వరైనా కొట్టుకుపోవాల్సిందే. హసీనా ఇండియాలో తలదాచుకుంది. తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరింది. మరి ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.