తన వారసుడి విషయంలో టిబెట్ బౌద్ధగురువు దలైలామా మరోసారి స్పష్టత ఇచ్చారు. చైనా వెలుపలే తన వారసుడు జన్మిస్తాడని తెలిపారు. ఆయన కొత్తగా రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. తన తర్వాత కూడా దలైలామా వారసత్వం కొనసాగాలని కోరారు. గతంలో ఓసారి మాట్లాడుతూ, నా తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చేమో అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట పుడతారని చెప్పారు. తన పునర్జన్మ టిబెట్ కు వెలుపలే ఉంటుందని, బహుశా అది భారత్లో కూడా కావొచ్చని అన్నారు. పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు. అందుకే తన బాధ్యత అయిన విశ్వశాంతి, కరుణకు గొంతుకగా ఉంటారు అని తెలిపారు. 14వ దలైలామాగా మారిన టెంజియన్ గ్యాట్సో 23వ ఏటే టిబెట్ నుంచి భారత్ కు వలసవచ్చారు. టిబెట్ వాదాన్ని సజీవంగా ఉంచింనందుకు ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని వెల్లడించారు. దలైలామా ప్రస్తుతం హిమాచల్ లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు.