Abortion pills: అబార్షన్ మందులకు అమెరికాలో భారీ గిరాకీ
గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ వదంతులు, 24 గంటల్లోనే 1 0 వేలకు పైగా ఆర్డర్లు;
అమెరికాలో అత్యవసర గర్భ విచ్ఛిత్తి మాత్రలకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన 24 గంటల వ్యవధిలో గర్భ విచ్ఛిత్తి మాత్రల ప్రధాన సరఫరాదారులలో ఒకరైన ఎయిడ్ యాక్సెస్‌కు గత 24 గంటల్లో ఈ మాత్రల కోసం 10 వేలకు పైగా విజ్ఞప్తులు వచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇది సాధారణంగా ప్రతిరోజు వచ్చే వాటికన్నా 17 రెట్లు అధికం. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును రద్దు చేస్తారంటూ పెద్దయెత్తున ప్రచారం జరగడంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గర్భం దాల్చని వారు సైతం ఈ గర్భవిచ్ఛిత్తి మాత్రల కోసం ఎగబడటం విశేషం.
ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా మందులు కొనుగోళ్లు చేస్తున్నట్లు సంబంధిత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10 వేలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4000 నుంచి 4,500 వరకు తమ వెబ్‌సైట్ చూసేవారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అలా చూసేవారి సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌సైట్‌ను చూస్తున్నారని తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలామంది మాత్రలు నిల్వ చేసుకున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో అభిప్రాయం వ్యక్తంచేశారు.