కుండపోత వర్షాలతో నేపాల్ విలవిలలాడుతోంది. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ సాయుధ దళాలు వెల్లడించాయి. దాదాపు 70మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు తెలిపాయి. నేపాల్‌లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారిలో కావ్రే పాలన్‌చౌక్ ఏరియాకు చెందిన వారు 34 మంది, లలిత్‌పూర్‌కు చెందిన వారు 20 మంది, దాడింగ్‌కు చెందిన వారు 15 మంది, ఖాట్మండుకు చెందిన వారు 12 మంది, మక్వాన్‌పూర్‌కు చెందిన వారు ఏడుగురు, సింధ్‌పాల్ చౌక్‌కు చెందిన వారు నలుగురు, డోలఖకు చెందిన వారు ముగ్గురు, పంచ్‌తర్, భక్తపూర్ జిల్లాలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు. దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ వరదల ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బిహార్‌లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.