Trump Tariff India: మరో ట్రంప్ స్టైల్ నిర్ణయం! వాహనాలపై సుంకాల మోత
భారత్‌పై ప్రభావం ఎంత?;
జనవరి 20న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో పన్నుల భారానికి సిద్ధమయ్యారు. దేశంలోకి దిగుమతవుతున్న విదేశీ వాహనాలపై కూడా పన్నులు పెంచాలనుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి వాహనాలపై కూడా సుంకాలు విధించనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ టారిఫ్‌ల గురించి ఆయన అదనపు సమాచారం ఇవ్వకపోయినా మార్చి 12 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల టారిఫ్‌ల మాదిరిగానే ఇది కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు.
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. బాధ్యతల్లోకి ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చీరాగానే ఎన్నో సంచలన ప్రకటించిన ట్రంప్.. వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ముందుగా.. తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులపైన 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించగా.. ఆయా దేశాలు స్పందించగా నెల రోజులు వాయిదా వేశారు. తర్వాత చైనా ప్రొడక్ట్స్‌పైన 10 శాతం సుంకాలు ప్రకటించారు. అటు నుంచి బదులు రాకపోవడంతో వెనక్కి తగ్గలేదు ట్రంప్. దీని తర్వాత.. స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకాల్ని ప్రకటించారు. ఇదంతా అయిపోయాక.. ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు.వివిధ దేశాలతో ముఖ్యంగా చైనాతో అమెరికా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. అంటే అమెరికా నుంచి చైనాలో కంటే.. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల బిల్లే ఎక్కువగా ఉంది. 2023-24లో మన దేశంతో కూడా ఇలాగే అమెరికాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది. అంటే.. మన ప్రొడక్ట్స్‌పై అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్స్ సగటు రేటు 3.3 శాతం అయితే .. అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్స్ సగటు రేటు 17 శాతంగా ఉంది. అంటే అమెరికా ఉత్పత్తులపైనే మనం ఎక్కువగా టారిఫ్స్ విధిస్తున్నాం. అందుకే.. ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు దేశాల ఉత్పత్తులపై టారిఫ్స్ మోత మోగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడిని కలిసిన రోజే.. ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "ప్రతీకార సుంకాల విషయంలో భారత్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.' అని కామెంట్స్ చేశారు. 2021-24 మధ్య కూడా భారత్‌కు అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల భారత్‌పై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆందోళనకరంగా మారింది. ట్రంప్ అసలు వదిలిపెట్టరన్న వాదన వినిపిస్తోంది.