Donald Trump : ట్రంప్‌కు టారిఫ్‌లు అచ్చివచ్చాయా? రెండు నెలల్లో రూ. 680 కోట్లకు పైగా బాండ్‌లు కొనుగోలు.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద ఊహించని విధంగా పెరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ల ప్రకారం.. ట్రంప్ కేవలం రెండు నెలల్లో (ఆగస్టు చివరి నుంచి అక్టోబర్ ప్రారంభం వరకు) కనీసం 82 మిలియన్ డాలర్లు (రూ. 680 కోట్లకు పైగా) విలువైన బాండ్‌లను కొనుగోలు చేశారు. ఇవి కార్పొరేట్ బాండ్‌లు, మునిసిపల్ బాండ్‌లు.
యూఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ ఇచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం.. ట్రంప్ కొనుగోలు చేసిన బాండ్ల గరిష్ట మొత్తం విలువ 337 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,790 కోట్లు) వరకు ఉంది. ఎథిక్స్ ఇన్ గవర్నమెంట్ యాక్ట్-1978 అనే పాత చట్టం ప్రకారం.. ప్రతి కొనుగోలుకు కచ్చితమైన అమౌంట్ చెప్పకుండా ఒక పరిమితి మాత్రమే వెల్లడించారు. ఈ రెండు నెలల కాలంలో ట్రంప్ మొత్తం 175 లావాదేవీలు చేశారు.
ట్రంప్ కొనుగోలు చేసిన కార్పొరేట్ బాండ్‌లలో పేరున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. గోల్డ్‌మ్యాన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి పెద్ద బ్యాంకులు, చిప్‌లు తయారు చేసే బ్రాడ్‌కామ్, క్వాల్‌కామ్, అలాగే మెటా (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) లాంటి టెక్ దిగ్గజాలు, హోమ్ డిపో, అషర్ హెల్త్ వంటి సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు. వీటితో పాటు రాష్ట్రాలు, కౌంటీలు, పాఠశాల జిల్లాలు వంటి ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన మునిసిపల్ బాండ్‌లలో కూడా ట్రంప్ పెట్టుబడి పెట్టారు.
ట్రంప్ తీసుకున్న ఆర్థిక సరళీకరణ వంటి విధానాల వల్ల లాభం పొందిన రంగాలలోనే ఆయన ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశమైంది. అలాగే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టారిఫ్‌లను ప్రకటించారు. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ట్రంప్ కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందిందని, అందుకే ఆయన సంపద పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆర్థిక వివరాలు వెల్లడించకముందే ట్రంప్ పరిపాలన ఒక వివరణ ఇచ్చింది. తన పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తున్నప్పటికీ ఈ డబ్బును ఎక్కడ పెట్టాలనే నిర్ణయంలో ట్రంప్‌కు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. ఈ పోర్ట్‌ఫోలియోను ఒక థర్డ్ పార్టీ ఆర్థిక సంస్థ నిర్వహిస్తోందని వారు స్పష్టం చేశారు.