Donald Trump : ట్రంప్ ఎన్నికల హామీ.. ప్రతి అమెరికన్‌కు రూ. 1.77 లక్షలు టారిఫ్ డివిడెండ్!

Update: 2025-11-11 08:00 GMT

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన టారిఫ్ డివిడెండ్ ప్లాన్ తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రకటన ప్రకారం తమ టారిఫ్ విధానం ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికన్ పౌరులకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా, ప్రతి వ్యక్తికి $2,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.77 లక్షలు) టారిఫ్ లాభంగా ఇవ్వనున్నట్లు ట్రూత్ సోషల్లోని తన పోస్ట్‌లో తెలిపారు. తన టారిఫ్ విధానాన్ని విమర్శించేవారిని ఖండిస్తూ ఈ ప్లాన్‌ను సమర్థించుకున్న ట్రంప్, ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఎలా బలాన్నిస్తుందో వివరించారు.

డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానం నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని నేరుగా అమెరికన్ పౌరులకు పంచడం ద్వారా తన ఆర్థిక విధానాన్ని సమర్థించుకున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో, ప్రతి అమెరికన్ పౌరుడికి $2,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.77 లక్షలు) టారిఫ్ డివిడెండ్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తమ విధానాల ద్వారా ట్రిలియన్ల డాలర్లు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదాయంతో దేశంలో పెరుగుతున్న $37 ట్రిలియన్ల అప్పును త్వరలో తీర్చడం ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ విధానం వల్ల అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెరుగుతాయని, దేశమంతటా కొత్త ఫ్యాక్టరీలు ప్రారంభమవుతాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ డివిడెండ్ ప్లాన్ ప్రకటించినప్పటికీ, ఈ డబ్బు అమెరికాలోని ప్రతి పౌరుడికి అందుతుందా లేదా అనే దానిపై స్పష్టత కొరవడింది. అధిక ఆదాయం ఉన్న వర్గాలను మినహాయించి, మిగిలిన వారికి ఈ డివిడెండ్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, లబ్ధిదారులను నిర్ణయించడానికి ఆదాయానికి సంబంధించి ఎటువంటి కేటగిరీలు నిర్ణయించబడలేదు.

ఎవరికి, ఎలా డివిడెండ్ ఇవ్వాలి అనేదానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. నివేదికల ప్రకారం, భారతదేశంలోని పీఎం కిసాన్ పథకం మాదిరిగా నేరుగా నగదు రూపంలో ఈ మొత్తాన్ని ఇచ్చే అవకాశం తక్కువగా ఉండవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఈ డివిడెండ్‌ను ప్రజలకు పరోక్షంగా అందించడానికి కొన్ని ఆర్థిక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు పన్ను రాయితీలు ఇవ్వడం లేదా పన్ను బిల్లులో గణనీయమైన తగ్గింపులు ప్రకటించడం వంటి చర్యల ద్వారా ఈ డివిడెండ్ ప్రయోజనాన్ని పరోక్షంగా ప్రజలకు అందించే అవకాశం ఉంది. ఈ పరోక్ష పద్ధతిలో అమలు చేయడం ద్వారా, ట్రంప్ తన టారిఫ్ విధానం ఆర్థిక ప్రయోజనాలు దేశీయ పౌరులకు చేరేలా చేయాలని యోచిస్తున్నారు.

Tags:    

Similar News