Donald Trump: గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ భద్రతపై నాటోతో కీలక ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్ సిద్ధం
ఒప్పందం నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి సుంకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గ్రీన్‌లాండ్, మొత్తం ఆర్కిటిక్ ప్రాంత భద్రత విషయంలో నాటోతో ఒక కీలక ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్ కుదిరినట్టు ఆయన వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ డీల్ అమెరికాతో పాటు అన్ని నాటో దేశాలకు గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు.
నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశం చాలా ఫలప్రదంగా సాగిందని, దీని ఆధారంగానే గ్రీన్‌లాండ్‌పై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పన చేశామని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఈ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొన్ని సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉంటుందని, 99 ఏళ్ల లీజు ఒప్పందాల కన్నా మెరుగైనదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందం వెనుక ప్రధాన ఉద్దేశం భద్రతేనని ట్రంప్ స్పష్టం చేశారు. "నాకు గ్రీన్‌లాండ్ భద్రతే కావాలి. మరే ఇతర కారణం కోసం కాదు" అని అన్నారు. ఇది ఆర్థిక అంశం కాదని, జాతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే నాటో దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచాయని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన మార్క్ రుట్టే, అమెరికాపై దాడి జరిగితే నాటో దేశాలన్నీ అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు.
డెన్మార్క్ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల ప్రాంతమైన గ్రీన్‌లాండ్, ఉత్తర అమెరికా-యూరప్ మధ్య ఆర్కిటిక్‌లో కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఇక్కడ అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరాలు ఉన్నాయి. పెరుగుతున్న ప్రపంచ పోటీ నేపథ్యంలో ఆర్కిటిక్‌లో ప్రాబల్యం పెంచుకోవడం అమెరికాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన అంశం.