అఫ్ఘనిస్థాన్ హిందూ కుష్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. పాకిస్థాన్, అఫ్ఘన్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడంతో ఇరుదేశాల్లో కలిపి 11మంది మరణించారు. అఫ్ఘనిస్థాన్ లో ఇద్దరు, పాకిస్థాన్ లో 9 మంది మరణించారు. యునైటెడ్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం అఫ్ఘనిస్థాన్ లోని జర్మ్ లో 180కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో మంగళవారం రాత్రి 10:17 గంటలకు సంభవించింది.
పాకిస్థాన్ లో ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లో 100మందికి పైగా ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అధికారులు హాస్పిటల్ కు తరలించినట్లు పాకిస్థాన్ అత్యవసర సేవల ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. పాకిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)తో పాటు ఫెడరల్ గవర్నమెంట్ పాలిక్లినిక్‌లో అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది.