తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.
తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ దేశ చరిత్రలో 1999లో అతి పెద్ద భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 2,415 మంది ప్రాణాలు కోల్పోగా , వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. నాటి నుంచి అక్కడి ప్రభుత్వం నిత్యం ప్రజల్లో భూకంపాలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక మార్చి 28న థాయిలాండ్, మయన్మార్‌లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 3,600 మంది మృతి చెందగా, 5,017 మంది గాయపడ్డారు. 160 మంది గల్లంతయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, టెలిఫోన్ సేవలకు అంతరాయం కలిగించింది. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.