భారీ భూకంపంతో టర్కీ, గ్రీస్ దేశాలు వణికాయి. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6 పాయింట్లుగా నమోదైందని టర్కీకి చెందిన డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. రెండు దేశాల్లో అనేక భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కొల్పోగా... 200 మందికి పైగా గాయలయ్యాయి. ఇంకా వందలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవన శిథిలాల నుంచి చిక్కుకున్న వారికి కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
టర్కీలోని సముద్ర తీర నగరమైన ఇజ్మీర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలాయి. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. నగరంలో పలు చోట్ల దట్టంగా పొగ వ్యాపించడం వంటివి కనిపించింది. ఇజ్మీర్‌లో దాదాపు 20కి పైగా భవనాలు కుప్పకూలాయని అక్కడి మీడియా సంస్థ తెలిపింది.
భూ ప్రకంపనలు తూర్పు గ్రీక్ దీవులను కూడా తాకాయి. సమోస్, ఇతర దీవుల ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని గ్రీక్ మీడియా తెలిపింది. ఇజ్మీర్ తీరానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం వుందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 పాయింట్లుగా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే కేంద్రం తెలిపింది.