TWITTER: ట్విట్టర్ యూజర్లకు మస్క్ భారీ షాక్... ఇక చదవాలన్న లిమిటే
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్... పోస్టులను చూసేందుకు కూడా లిమిట్... రోజూ 6,000 పోస్ట్‌లే చదవచ్చని ట్వీట్;
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఈ సారి యూజర్లకు భారీ షాక్ ఇచ్చాడు. ఎక్కువ మంది వైరిఫై అకౌంట్లు తీసుకునేలా సరికొత్త ప్లాన్ వేశాడు. పోస్టులను చూసేందుకు కూడా లిమిట్ సెట్ చేశాడు. ఇక నుంచి వెరిఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు ఆరు వేల పోస్టులు వరకు చూడగలరు. ట్విట్టర్ యూజర్లు ప్రతిరోజూ చదివే పోస్ట్‌ల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్ట్‌లను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేసినట్లు మస్క్ వెల్లడించాడు. సిస్టమ్ డేటా స్క్రాపింగ్, తారుమారుని నిరోధించడానికి ఇది తీసుకొచ్చినట్లు ట్వీట్ చేశాడు. వెరిఫై చేసిన ఖాతా నుంచి ప్రతిరోజూ సుమారు 6,000 పోస్ట్‌లను చదవవచ్చని.. వెరిఫై చేయని ఖాతా నుంచి ప్రతిరోజూ 600 పోస్ట్‌లను మాత్రమే చదవవచ్చని మస్క్ తెలిపాడు. ఇంకా ధ్రువీకరించని కొత్త ఖాతాల యూజర్లు కేవలం 300 పోస్ట్‌లను మాత్రమే చదవగలరని మస్క్ ట్వీట్ చేశాడు. డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్‌ను నిరోధించడానికి తాము అనేక తాత్కాలిక పరిమితులను అమలు చేశామని కూడా తెలిపాడు. పోస్టులను చూసే సంఖ్య లిమిట్‌కు దగ్గరలో ఉన్నప్పుడు అలర్ట్ మెసెజ్ వస్తుంది.
అనంతరం మరో ట్వీట్ చేసిన ఎలన్ మస్క్.. త్వరలోనే వెరిఫైడ్ యూజర్లకు 8 వేలు, అన్‌వెరిఫైడ్ యూజర్లకు 800, కొత్త యూజర్లకు 400కి పోస్టుల చూసే లిమిట్ పెంచుతామని వెల్లడించారు. ఈ ట్వీట్ తర్వాత మరోసారి ట్వీట్ చేస్తూ.. ఇప్పటి నుంచి వెరిఫైడ్ అకౌంట్లకు 10 వేల పోస్టులు, అన్‌వెరిఫైడ్ యూజర్లకు 1000, కొత్త వినియోగదారులకు 500 పోస్టులకు లిమిట్ పెంచినట్లు తెలిపాడు. వెంటవెంటనే మస్క్ తన నిర్ణయాలు మార్చుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అంతకుముందు శనివారం సాయంత్రం నుంచి ట్విట్టర్ ఓపెన్ అవ్వగా యూజర్ల ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. రోజులో చూసే లిమిట్ అయిపోవడంతో ట్విట్టర్ ఓపెన్ అవ్వలేదని ఎలన్ మస్క్ ట్వీట్ తరువాత అర్థమైంది. శుక్రవారం నుంచి వినియోగదారులు ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా లాగిన్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ట్విట్టర్ నుంచి డేటా చోరీకి గురవుతుందని.. సాధారణ వినియోగదారుల పోస్టులను దుర్వినియోగం చేస్తున్నారని మస్క్ చెప్పారు. ట్విట్టర్ ఆదాయాన్ని పెంచేందుకు బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.