Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చూపు పోయే ప్రమాదం
కుటుంబ సభ్యులు, పీటీఐ నేతల తీవ్ర ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కంటిలో సమస్య తీవ్రమైందని, వెంటనే సరైన చికిత్స అందించకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని పీటీఐ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జైలు అధికారులు వైద్యుల సూచనలను పట్టించుకోకుండా... ఇమ్రాన్ కు జైల్లోనే చికిత్స చేయాలని పట్టుబట్టడంతో పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్య తలెత్తింది. 2024 అక్టోబర్‌లో ఆయన తన వ్యక్తిగత వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి ఆ డాక్టర్‌ను కలిసే అవకాశం లభించలేదు. పీటీఐ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. జైలు అధికారులు మాత్రం జైలు లోపలే చికిత్స అందిస్తామని చెబుతూ అనుమతి నిరాకరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై జైలు అధికారులు ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.