MUSK: ఔరా.. మస్క్ అంత పనిచేశాడా...!
ఎలాంటి రుసుము చెల్లించకుండా యూజర్ నుంచి 'X' అకౌంట్ తీసేసుకున్న ఎలాన్ మస్క్... విమర్శలు;
రెండు రోజుల క్రితం ట్విటర్ (Twitter) పేరును ఎక్స్ (X)గా మారుస్తూ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ట్విటర్ బ్లూ బర్డ్ స్థానంలో కొత్త లోగోగా ఎక్స్‌ను తీసుకొచ్చారు. మస్క్ ఎందుకు ట్విటర్ పేరును ఎక్స్‌గా మార్చారనే దానిపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చ కొనసాగుతుండగానే మరో కొత్త వివాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందేంటంటే..
'X' అనే యూజర్ (X' username) నుంచి ఎలాంటి రుసుము చెల్లించకుండా( original owner without paying) ఎలాన్ మస్క్(MUSK) అతని ఖాతాను తీసేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎటువంటి హెచ్చరిక లేకుండా మస్క్ సంస్థ ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. "X" అనే ట్విట్టర్ ఖాతాను 2007 నుంచి జేన్ ఎక్స్ హవాంగ్ అనే వ్యక్తి వినియోగిస్తున్నాడు. హవాంగ్ ఒక ఈవెంట్ ఫోటో కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
ఈ నెల ప్రారంభంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ పక్షి లోగోను X అక్షరంతో మార్చారు. దీనికి సరిపోయేలా అధికారిక ఖాతాను కూడా మార్చారు. ఈ సమయంలోనే కంపెనీ ఎలాంటి ఆర్థిక పరిహారం, హెచ్చరిక లేకుండా అసలు యజమాని నుంచి "X" ఖాతాను తీసేసుకుందని అభిక్ సేన్‌గుప్తా అనే యూజర్ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
వాక్ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్‌ను మార్చాలని ఎక్స్ కార్పొరేషన్ దాన్ని కొనుగోలు చేసిందని మస్క్ తెలిపారు. అందులో భాగంగానే ట్విటర్ పేరును ఎక్స్‌గా మార్చామని. కేవలం పేరు మార్చుకోవడమే కాదు.. ఇకపై ట్విటర్ (ఎక్స్) అదే పనిచేస్తుందని వెల్లడించారు. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్ అనే పేరు సరిపోతుందని, కానీ, ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదని... ఎందుకంటే ప్రస్తుతం ఎక్స్‌లో ట్వీట్‌లు మాత్రమే కాదు పెద్ద సైజున్న వీడియోలు కూడా షేర్ చేయొచ్చని మస్క్ తెలిపారు.
మరికొద్ది నెలల్లో ఎక్స్‌లో కీలక మార్పులు రానున్నాయని, ఇకపై యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. ఎక్స్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చబోతున్నామని మస్క్ వెల్లడించారు. ఇప్పటికే వీడియోలకు సంబంధించి కొత్త ఫీచర్లను పరిచయం చేశామని వెల్లడించారు.