Indian Army : టెర్రరిస్టుల ఐదు ఇండ్లు పేల్చివేత.. ఫుల్ యాక్షన్ లో ఆర్మీ
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
ఉగ్రవాదుల ఇళ్లను వెతికి ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా నిన్న రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతను కొన్నేళ్లుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. 2023 జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు.
కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. అహ్‌సన్ 2018లో పాకిస్థాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత కశ్మీర్ లోయలోకి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఇక, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కరే తరఫున యాక్టివ్‌గా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైనా ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం.
పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇప్పటికే నేలమట్టం చేశారు. వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. వారి ఇళ్లల్లో అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని, భద్రతా బలగాలను ట్రాప్ చేయడం కోసమే వాటిని యాక్టివేట్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు అనుచరులను భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి. అయితే, వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు.