Social Media Accounts : విదేశీయులు ఐదేండ్ల సోషల్‌ మీడియా ఖాతాలు చూపాల్సిందే

వీసా మంజూరుకు అమెరికా కొత్త మెలిక

Update: 2025-12-11 02:15 GMT

గత ఐదేండ్లలో మీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌/ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా ఖాతాల్లో ఏమున్నదో చూపించి ఆ తరువాతనే మా దేశంలోకి అడుగుపెట్టండి అని అమెరికా సరికొత్తగా మరో నిబంధనను ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. ట్రంప్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత విదేశీయుల రాకపై పలు రకాల ఆంక్షలు విధిస్తున్న అమెరికా తాజాగా మరొక దానిని ప్రతిపాదించింది.

తమ దేశంలోకి వచ్చే విదేశీయులు తప్పనిసరిగా గత ఐదేండ్ల సోషల్‌మీడియా చరిత్రను తమకు అందజేయాలని పేర్కొంది. ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌కు చెందిన పౌరులు వీసా లేకుండానే అమెరికాలో ప్రవేశించవచ్చు. అయితే వీరు కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాలను అందుబాటులో ఉంచాల్సిందేనని అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ సంస్థ స్పష్టం చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ కొత్తగా చేపట్టిన సోషల్‌ మీడియా తనిఖీ విధానంతో మన దేశంలో హెచ్‌-1బి వీసా దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘వీసా నియామకం రీషెడ్యూల్‌ అయిందంటూ మీకు ఈ-మెయిల్‌ వచ్చిన పక్షంలో నూతన నియామక తేదీ విషయంలో కార్యాలయం మీకు సహాయం చేస్తుంది’ అని దరఖాస్తుదారులకు తెలిపింది. అలాగే, రీషెడ్యూల్‌ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో తెలియజేసిన ఇంటర్వ్యూ తేదీ రోజున కాన్సులేట్‌కు వస్తే ప్రవేశం నిరాకరించడం జరుగుతుందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. గతంలో తెలియజేసిన నియామక తేదీ రోజు వస్తే ఎంబసీ లేదా కాన్సులేట్‌లో ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీ చేసే నిమిత్తం వచ్చే వారాలకు అనేక ఇంటర్వ్యూలను రీషెడ్యూల్‌ చేశారని ఓ అటార్నీ చెప్పారు. హెచ్‌-1బి వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన హెచ్‌-4 వ్యక్తుల కోసం స్క్రీనింగ్‌, పరిశీలన చర్యలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా ఈ వ్యక్తుల అన్ని సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ యొక్క గోప్యతా సెట్టింగ్‌లను ‘పబ్లిక్‌’గా మార్చాలని ఆదేశించింది. ఈ నెల 15 నుంచి దరఖాస్తుదారుల ఆన్‌లైన్‌ సమాచారాన్ని అధికారులు సమీక్షిస్తారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, పర్యాటకులు ఇలాంటి సమీక్షలకు గురయ్యారు.

Tags:    

Similar News