Flash floods : నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు
కొట్టుకుపోయిన వందలాది వాహనాలు;
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
చైనా భూభాగంలో ఊహించని రీతిలో కుండపోత వర్షాలు కురిశాయి. అతి భారీ వర్షాలు కురవడంతో మంగళవారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లోని తైమూర్ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
భోటేకోషి నది వెంబడి ఉన్న కస్టమ్స్ పోర్టులో నిలిపి ఉన్న 200 వాహనాలు కొట్టుకుపోయాయని రసువా చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. నేపాల్-చైనాను కలిపే వంతెను కొట్టుకుపోయిందని చెప్పారు. ఇక చాలా మంది వ్యాపారులు గల్లంతైనట్లు చెప్పుకొచ్చారు. ఇక నేపాల్‌కు చెందిన 12 మంది పోలీసులు కూడా గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉందని.. పరిస్థితులు శాంతించగానే నేపాల్ సైన్యం సహాయ చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఎంతమంది గల్లంతయ్యారన్న విషయాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించినట్లు తెలుస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని రీతిలో వరద దూసుకొచ్చింది. ఎంత మంది చనిపోయారన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. వాహనాలతో పాటు ప్రజలు కొట్టుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
వరదలకు గల కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు. టిబెటన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతోనే నదలు ఉప్పొంగాయని భావిస్తున్నారు. ఇక త్రిశూలి నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.