Sheikh Hasina: షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో మర్డర్ కేసు
ఆమెతో పాటు అవామీ లీగ్ పార్టీ కీలక నేతలను చేర్చిన పోలీసులు;
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో ఆమెతో పాటు ఆరుగురు మాజీ మంత్రులు, అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. హింసాత్మక నిరసనల కారణంగా ఓ కిరాణా దుకాణం యజమాని మరణానికి ఆమె కూడా కారణమని పేర్కొంటూ ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఇందులో అవామీ లీగ్ పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.
నిరసనలకు సంబంధించి షేక్ హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలంగా జులై 19న మొహమ్మద్‌పూర్‌లో జరిగిన ఆందోళన జరిగింది. అయితే నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబూ సయ్యద్ అనే కిరాణా దుకాణం యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చనిపోయిన వ్యక్తి సన్నిహితుడు ఈ కేసు పెట్టారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ కూడా కేసులో ఉన్నారు.
కాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమర యోధుల కోటాను పూర్తిగా రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 300లకు పైగా పౌరులు మృత్యువాతపడ్డారు. హింసకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో ఆమె పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రాజీనామా చేసిన వెంటనే భారత్‌కు వచ్చి ప్రస్తుతం తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు.
బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు. ఆత్మలందరి మోక్షానికి ప్రార్థించాలని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ తన సోషల్ మీడియా ఎక్స్‌లో షేక్ హసీనా తరపున ఒక ప్రకటనను విడుదల చేశారు.