Global Boiling : ఇది వేడి కాదు మంటే
గ్లోబల్ వార్మింగ్ కాదు గ్లోబల్ బాయిలింగ్ అంటున్న శాస్త్రవేత్తలు
గ్లోబల్ వార్మింగ్. ఇప్పటి వరకూ మనం వింటున్న విషయమే. ఎంత విన్నామంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవడం కూడా మానేసేంత. అని ఇప్పుడు మనం ఉన్న స్టేజి గ్లోబల్ వార్మింగ్ కాదు గ్లోబల్ బాయిలింగ్ పాయింట్‌కి చేరుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు సైంటిస్ట్‌లు. ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని దేశాల్లో రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మానవాళికి శాస్త్రవేత్తలు హెచ్చరికలు పంపారు.
ప్రపంచ దేశాలను అస్తవ్యస్తంగా మారిన వాతావరణం భయపెడుతోంది. ఒకవైపు రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు ముంచెత్తుతున్న భారీ వర్షాలు దేశాలను కంటిమీద కునుకు వేయనీయడం లేదు. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జులై చరిత్రకెక్కింది. 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించిపోనున్నాయి. లక్షా 20వేల సంవత్సరాల్లో ఈ స్థాయి ఉక్కపోత ఎప్పుడూ లేదని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతలను సేకరించి ఈ రికార్డులను తయారు చేశామని తెలిపారు.
ఈ ఏడాది జులై నెల తొలి 23 రోజుల్లో సగటున 16.95 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2019 జులైలో నమోదైన 16.93 రికార్డు కంటే ఎక్కువ. గత లక్షా 20 వేల ఏళ్లలోనే ఈ జులై నెలను వేడి నెలగా చెబుతున్నారు. పురాతన ఉష్ణోగ్రతలను చెట్ల మానులోని వలయాలను, కోరల్ రీఫ్స్, సముద్ర గర్భం నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా లెక్కిస్తారని ఇవి మానవ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలని వెల్లడించారు.
ఈ సారి ఉత్తరార్ధ గోళంలో వేసవి ఎన్నడూ లేనంత స్థాయిలో ఉందని ఇవే ఉష్ణోగ్రత రికార్డులు బద్దలు కావడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటేసిందని గుర్తు చేశారు. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. జూన్‌లో కూడా ఎండలు మండిపోయాయి. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఈ నెల 6వ తేదీన నమోదైంది. జులై ఆరున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.08 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది చరిత్రలోనే అత్యధికం. వాస్తవానికి జులై 3 తర్వాత ఉష్ణోగ్రత రికార్డు బద్దలుకొడుతూ నమోదవుతోంది. ఈ ఏడాది మే నెలలో సముద్రంపై వేడి కూడా అసాధరణ స్థాయిలో నమోదైంది
భూమిపై వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ దశ నుంచి గ్లోబల్ బాయిలింగ్ దశకు చేరుకొన్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. భూగోళం ఉత్తర భాగంలో ఈ నెలలో నమోదైన అసాధారణ ఉష్ణోగ్రతలే అందుకు ఉదాహరణ అని తెలిపారు.