Floods: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం..
వాటిని వెతికేపనిలో వీధుల్లో స్థానికులు;
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పలు నగరాలు అతలాకుతలం అయ్యాయి. వస్తువులు, కార్లు కొట్టుకుపోయాయి. అలాగే ఒక నగల షాపును కూడా భారీ వరద ముంచెత్తింది. దీంతో షాపులో ఉన్న రూ.12 కోట్ల బంగారం కొట్టుకుపోయింది. మొత్తం 20 కిలోల వెండి, బంగారం కొట్టుకుపోయినట్లు షాపు యజమాని తెలిపాడు.
వాస్తవానికి వరదలు ముంచెత్తినప్పుడు సిబ్బందిని కాపాలాగా పెట్టారు. కానీ దుకాణంలో ప్రదర్శన కోసం ఉంచిన ఆభరణాలకు మాత్రం తాళం వేయలేదు. కానీ ఇంతలోనే భారీ వరద ముంచెత్తింది. జూలై 25న షాపు ఓపెన్ చేసి చూడగా ప్రదర్శనలో ఉన్న 20 కిలోల వెండి, బంగారు ఆభరణాలు కొట్టుకుపోయినట్లు గుర్తించారు. నిమిషాల వ్యవధిలోనే వరద దూసుకొచ్చినట్లు సిబ్బంది తెలిపారు. తేరుకునేలోపే తలుపు గుండా వరద వచ్చేసిందని పేర్కొన్నారు. రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు పోయాయని యజమాని వాపోయాడు. అయితే బురదలో ఆభరణాలు దొరుకుతాయేమోనని ఉద్యోగులు రంగంలోకి దిగి వెతకడం ప్రారంభించారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా కొంత మంది స్థానికులు కూడా సహాయం చేశారు. అలా వెతకగా కిలో ఆభరణాలు దొరికినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ వార్త వ్యాప్తి చెందడంతో ప్రజలు మెటల్ డిటెక్టర్లతో వేటాడడం ప్రారంభించారు. కొందరు స్థానికులకు బంగారం దొరకగానే ఇంటికి తీసుకెళ్లిపోయారు. కొందరు షాపు యజమానికి తిరిగి ఇచ్చేయగా.. ఇంకొందరు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.