Sweden: స్వీడన్‌లో కాల్పులు.. 10 మంది మృతి
మృతుల్లో కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా;
స్వీడన్‌లోని ఓ పాఠశాలలో (వయోజన విద్యా కేంద్రం)లో మంగళవారం మధ్యాహ్నం కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి పాఠశాలలో జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నాడని, 15 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. స్టాక్‌హోమ్‌కు సుమారు 200 కిమీల దూరంలోని ఒరెబ్రో నగర శివారులోని పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తి చేయని 20 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఈ పాఠశాలలో చదువుతుంటారు. ప్రధాన పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన పరీక్ష అనంతరం పాఠశాలలోని ఓ గదిలో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాల్పుల ఘటనలో ఉగ్రవాద కోణం లేదని, కొంతకాలంగా దేశంలో జరుగుతున్న గ్యాంగ్‌వార్‌ల్లో భాగంగా జరిగిన ఘటనని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విషయాన్ని స్వీడన్ పోలీసులు సైతం ధ్రువీకరించారు. కాల్పులు జరిపింది నిందితుడు ఒక్కడేనని, ఈ సంఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉందని భావించడం లేదని తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో అధికారికంగా ధ్రువీకరించలేదు. కాల్పులతో ఉపాధ్యాయుడు, విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు. స్వీడన్ చరిత్రలో విచారకరమైన రోజని తెలిపారు. ఇది ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. .