H-1B Visa Fee Hike: H-1B వీసా ఫీజుల షాక్.. భారతీయ ఐటీ కంపెనీలపైనే ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకు?
H-1B Visa Fee Hike: అమెరికాలో పనిచేయాలనుకునే భారతీయ ఐటీ ఉద్యోగులకు, వారిని పంపే కంపెనీలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఇకపై కొత్తగా అప్లై చేసే ప్రతి H-1B వీసా దరఖాస్తుకు ఏకంగా లక్ష డాలర్లు (దాదాపు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితమయ్యే దేశం భారతే, ఎందుకంటే గత ఏడాది జారీ అయిన వీసాలలో 71% భారతీయులకే దక్కాయి. ఈ భారీ ఫీజు పెరుగుదల భారతీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లపై గట్టి ప్రభావం చూపింది.
H-1B వీసా ఫీజుల పెంపు ప్రకటన వచ్చిన కేవలం ఒక వారంలోనే భారతీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పడిపోయాయి. టీసీఎస్ షేర్ 8.9% పడిపోగా, ఇన్ఫోసిస్ షేర్ 6.1% తగ్గింది. వీసా ద్వారా ఉద్యోగులను అమెరికాకు పంపే భారతీయ కంపెనీల లాభాలపై ఈ కొత్త ఫీజు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. మరోవైపు, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా H-1B వీసాలను ఎక్కువగా ఉపయోగిస్తాయి. అయితే, ఈ ప్రకటన తర్వాత అమెజాన్ షేర్ 4.9% పడిపోగా, మైక్రోసాఫ్ట్ షేర్ కేవలం 1.4% మాత్రమే తగ్గింది.
అమెరికన్ కంపెనీలపై ప్రభావం తక్కువగా ఉండటానికి కారణం.. వీసా ఉద్యోగులకు వారు చెల్లించే వేతనాలలో ఉన్న తేడానే. టీసీఎస్ తమ H-1B ఉద్యోగులకు సగటున సంవత్సరానికి $78,000 (సుమారు రూ.65 లక్షలు) చెల్లిస్తుంది. ఇన్ఫోసిస్ సగటు వేతనం $71,000 (సుమారు రూ.59 లక్షలు) గా ఉంది.
అమెజాన్ సగటున $143,000 (సుమారు రూ.1.19 కోట్లు), మైక్రోసాఫ్ట్ సగటున $141,000 (సుమారు రూ.1.17 కోట్లు) చెల్లిస్తున్నాయి. ఈ కొత్త $100,000 ఫీజు.. భారతీయ కంపెనీల ఉద్యోగుల జీతాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అవుతుంది. అంటే, భారతీయ కంపెనీల లాభాల మార్జిన్‌పై ఈ ఫీజు తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. అందువల్లే, ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలకే ఎక్కువ నష్టం కలిగిస్తోంది.
ఆసక్తికరంగా, అమెరికన్ టెక్ కంపెనీలు ఈ కొత్త ఫీజును పెద్దగా వ్యతిరేకించడం లేదు. దీనికి కారణం H-1B వీసాలు లాటరీ సిస్టమ్ ద్వారా ఇస్తారు. భారతీయ కంపెనీలు ఈ అధిక ఫీజు కారణంగా దరఖాస్తులు తగ్గించుకుంటే, ఆటోమేటిక్‌గా అమెరికన్ కంపెనీలకు వీసాలు దక్కే అవకాశాలు పెరుగుతాయి. అధిక వేతనాలు చెల్లించే కంపెనీలకే వీసాలు దక్కేలా అమెరికా పాలసీ మారుతుండటానికి ఈ $100,000 ఫీజు మొదటి అడుగుగా కనిపిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల భారత్‌కు ఒక సానుకూల అంశం ఉంది. వీసా ఫీజులు పెరిగినందున, భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాకు ఉద్యోగులను పంపడం తగ్గించి, ఆ ఖర్చును దేశంలోనే కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ఉపయోగించవచ్చు. అంటే, ఇప్పుడు అమెరికాకు దక్కని ఉద్యోగాలు దేశంలోనే స్థానిక సిబ్బందికి దక్కే అవకాశం ఉంది. కంపెనీలు ఈ కొత్త వ్యాపార నమూనాకు మారగలిగితే, వారి షేర్లు తిరిగి పుంజుకోవచ్చు. ప్రస్తుత షేర్ల పతనం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా మారుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హెచ్‌ఆర్ విభాగం అధిపతి ఒక ప్రకటనలో తమ కంపెనీ వ్యాపార నమూనా ఈ మార్పులకు సులభంగా అనుగుణంగా మారుతుందని తెలిపారు. తమ కంపెనీ ఇప్పటికే అమెరికాలో స్థానికంగా నియమించుకునే ఉద్యోగుల సంఖ్యను పెంచుతోందని, H-1B వీసాలపై ఆధారపడటం బాగా తగ్గించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం 500 మంది ఉద్యోగులు మాత్రమే H-1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారని ఆయన వివరించారు.