Israel-Hamas War: 48 మంది ఇజ్రాయిలీ బందీలకు హమాస్ “వీడ్కోలు”..

చంపేస్తామని పరోక్ష హెచ్చరిక..

Update: 2025-09-21 03:39 GMT

 ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం ఇప్పటికీ ఇజ్రాయిల్ రాజకీయ, సైనిక వ్యవస్థల్ని వెంటాడుతోంది.

దీనికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, సైనిక అధికపతి ఎయాల్ జమీర్ కారణం అవుతారని హమాస్ దుయ్యబడుతోంది. నెతన్యాహు అహంకారం వల్లే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా సిటీలో భారీ దాడులు నిర్వహిస్తోంది. టెన్నెళ్లు, భవనాలను బాంబులతో ధ్వంసం చేస్తోంది. 60 మందికి పైగా పాలస్తీనియన్లు తాజా దాడుల్లో మరణించినట్లు గాజా వైద్య అధికారులు చెబుతున్నారు. షేఖ్ రద్వాన్, తెహ్ అల్ హావా వంటి ప్రాంతాల్లో ఐడీఎఫ్ భీకర దాడులు చేస్తోంది. గత రెండు వారాల్లో 20 కంటే ఎక్కువ టవర్లను కూల్చివేసింది.

ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల బందీలకు ప్రాణహాని ఉందని హమాస్ చెబుతోంది. దీనికి ముందు ఇజ్రాయిలీ బందీ ఒకరు తన సొంత సమాధిని తవ్వుకుంటున్న వీడియో వైరల్ అయింది. అయితే, దీనిని మానసిక యుద్ధంగా అమెరికా ఖండించింది. బందీల విడుదల కోసం ఒక ఒప్పందం చేసుకోవడానికి నెతన్యాహూ ప్రభుత్వంపై సొంత దేశంలో ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయిల్‌లో ఉంటున్న ఖైదీలను విడిచిపెట్టాలని భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీడ్కోలు చిత్రం బయటకు వచ్చింది.

సోమవారం నాటికి ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా సహా 10 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా అధికారికంగా గుర్తించనున్నాయి. దీంతో, ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇదే జరిగితే ఇజ్రాయిల్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, హమాస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం చూస్తే, ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తే, తాము బందీలను చంపేస్తామని పరోక్షంగా చెప్పింది.

Tags:    

Similar News